కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో కనిపించకుండాపోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాహ్నవి) కేసులో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారంగా పోలీసులు భావిస్తూ వచ్చిన పెంపుడు కుక్క అనూహ్యంగా చనిపోయింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకర్ తెప్పించి కుక్కకు అమర్చిన పోలీసులు.. దీని సాయంతో పాప జాడ కనిపెట్టాలని భావించారు. అయితే సుమారుగా 80 నిమిషాల పాటు వివిధ ప్రాంతాలలో ఈ కుక్క సంచరించింది. దాదాపుగా 8 కిలోమీటర్ల మేర దూరం తిరిగిన తర్వాత ఇంటి వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. పెంపుడు కుక్క మరణానికి కారణాలేంటి..?మరోవైపు జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఈ పెంపుడు కుక్కే ప్రధాన ఆధారం. గత శనివారం రోజున చిన్నారితో పాటుగా ఈ పెంపుడు కుక్క అడవిలోకి వెళ్లింది. ఆ తర్వాత చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. అయితే మూడు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం స్థానికంగా ఉన్న కొండపై నుంచి పెంపుడు కుక్క తిరిగి వచ్చి.. పోలీసులు, హడావిడి గమనించి భయంతో మళ్లీ వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే కొంతమందిని కరిచి పారిపోయింది. ఐదురోజుల తర్వాత మళ్లీ తిరిగి రాగా. యూపీకి చెందిన కొంతమంది యువకులు చాకచక్యంగా దాన్ని బంధించారు. అనంతరం పోలీసులు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. ఈ ట్రాకర్ సాయంతో కుక్క ఎక్కడికి వెళ్తుందో గమనించి.. దాని ఆధారంగా పాప ఆచూకీ కనిపెట్టాలని భావించారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు.మరోవైపు పెంపుడు కుక్క గత రెండు రోజులుగా వింతగా ప్రవర్తించింది. కనీసం నీళ్లు కూడా తాగక, తిండి తినక, సరిగా నిలబడలేక విలవిలలాడింది. చివరకు శనివారం చనిపోయింది. అయితే కుక్క మరణంపైనా స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్క ఆరోగ్యం
క్షీణించటంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎవరైనా దాడి చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతితో.. పోలీసులు ఇప్పుడీ కేసును ఎలా విచారిస్తారనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది.