
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యం బాగోలేనప్పుడు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున మాత్రలు వేసుకోమ్మని వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో రాస్తుంటారు కదా! అయితే, ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా భార్యాభర్తలు ప్రతి ఉదయం, సాయంత్రం తప్పక వాడాల్సిన టాబ్లెట్ ఒకటి ఉందట. అది చాలా పవర్ఫుల్ అని, అయితే దానికి ఒక్క రూపాయీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఉదయం ఆరు సెకన్లు, సాయంత్రం ఆరు సెకన్లు దానికోసం కేటాయిస్తే చాలని చెబుతున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఇంతకీ దాని పేరేంటో తెలుసా? సిక్స్ సెకండ్స్ కిస్! అవును.. ఆరు సెకన్ల ముద్దు. ఆఫీసుకు వెళ్లే హడావుడిలో మీ శ్రీమతికి ముక్తసరిగా బై చెప్పేసి వెళ్లకుండా, కాస్త ఆగి తనను దగ్గరకు తీసుకొని కళ్లలోకి సూటిగా చూస్తూ ఆరు సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవాలని చెబుతున్నారు. అవసరమైతే మనసులో ఒకటి నుంచి ఆరు వరకూ అంకెలు లెక్కపెట్టుకోవాలి తప్ప, ఆఫీసులో చేయాల్సిన పనుల గురించి ఆ సమయంలో ఆలోచిస్తూ మల్టీటాస్కింగ్ చేయొద్దని సలహా ఇస్తున్నారు. అదే విధంగా సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగొచ్చాక విసుగ్గా సోఫాలో కూలబడిపోకుండా చిరునవ్వుతో భార్యామణిని ఆరు సెకన్ల పాటు ముద్దాడమంటున్నారు. ఆరు సెకన్ల సూత్రం ఎందుకూ అంటే.. చాలా మంది ముద్దును కూడా యాంత్రికంగా భావిస్తూ ఒక్క సెకనులోనే ముగిస్తున్నారట! ఈ తీరికలేని జీవితంలో సరిగ్గా మాట్లాడుకోవడానికి కూడా చాలా మంది దంపతులకు సమయం లేక వారి బంధంలో ఓ శూన్యత ఏర్పడుతోందని, దాన్ని తొలగించి అన్యోన్యతను పెంచుకోవడానికి ఈ ఆరు సెకన్ల ముద్దు ఇన్స్టాంట్ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు
/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.