
తమిళనాడులోని చారిత్రక చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ త్వరలో నూతన రూపు సంతరించుకోనుంది. 118 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ను భారతీయ రైల్వే 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' కింద ఆధునీకరిస్తోంది. ఇందుకోసం
సుమారు రూ. 842 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్టేషన్ చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ ఆధునీకరణ పనుల్లో భాగంగా గాంధీ-ఇర్విన్ రోడ్డు, పూనమల్లి హై రోడ్డు వైపు రెండు కొత్త జీ+3 (G+3) టెర్మినల్ భవనాలను నిర్మించనున్నారు. వీటిలో విశాలమైన వెయిటింగ్ లాంజ్‌లు, టికెటింగ్ కౌంటర్లు, వాణిజ్య సముదాయాలు, రూఫ్ ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు విడివిడిగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, స్కైవాక్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లను అందుబాటులోకి తెస్తారు.దీంతో పాటు, స్టేషన్‌కు ఇరువైపులా జీ+5 (G+5) అంతస్తులతో మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్తో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఒక బడ్జెట్ హోటల్‌ను కూడా నిర్మించనున్నారు. ఇప్పటికే గాంధీ-ఇర్విన్ రోడ్డు వైపు నిర్మించిన నూతన మల్టీ-లెవల్ పార్కింగ్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.1908లో ప్రారంభమైన ఎగ్మూర్ స్టేషన్, ఇండో-సార్సెనిక్ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి రోజుకు 560కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, రద్దీ సమయాల్లో గంటకు 24,600 మందికి పైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటారు.