
సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.75 ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన కుబేరపురం...సింగ్ గీతం బంగారం కోసం జరిగిన తవ్వకాలతో క్రమంగా తన అందాన్ని కోల్పోయింది. చెట్టు తర్వాత చెట్టు నేలకూలుతూ, ప్రకృతి
--సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.75 ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన కుబేరపురం...సింగ్ గీతం బంగారం కోసం జరిగిన తవ్వకాలతో క్రమంగా తన అందాన్ని కోల్పోయింది. చెట్టు తర్వాత చెట్టు నేలకూలుతూ, ప్రకృతి నిశ్శబ్దంగా చనిపోతుంటే ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఊరిలో ఒకే ఒక్క చెట్టు మిగిలింది. కానీ ఆ చెట్టు గౌరి అనే అమాయక అమ్మాయికి చెందింది. ఆమె వరకూ అది కేవలం చెట్టు కాదు... తల్లి. ఆ చెట్టునే ఆలింగనం చేసుకుంటూ పెరిగిన గౌరి, దానిలో తన తల్లి ప్రేమను, తన జీవితాన్ని చూసుకుంది. కానీ సంపద మీద మోజు మనుషుల కళ్లను మూసేసింది. కోట్ల రూపాయల ఆశతో ఆ చివరి చెట్టును కూడా నరికేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తన తండ్రి ఆస్తి కోసం కుబేరపురానికి వచ్చిన ప్రతాప్, మైనింగ్ వ్యాపారంలో ఉన్న రేణుతో చేతులు కలిపాడు. బంగారం కోసం మరింత లోతుగా తవ్వాలంటే ఆ చెట్టు అడ్డుగా ఉందని భావించి, దానిని నేలమట్టం చేసేశారు. తన కళ్లముందే తల్లిలా భావించిన చెట్టు కూలిపోవడం చూసిన గౌరి గుండె పగిలిపోయింది. అయితే ఆ రోజు కూలింది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు...ఒక ఊరి అదృష్టం కూడా. సింగ్ గీతం ఆ రాత్రే జరిగిన ఒక సంఘటన తర్వాత కుబేరపురంపై ఒక శాపం పడింది. మరుసటి ఉదయం లేచిన గ్రామస్తులు షాక్ అయ్యారు. ఎంత ప్రయత్నించినా వారి నోట మాటలు రావడం లేదు. మాటల స్థానంలో పాటలు మాత్రమే వస్తున్నాయి! అంతేకాదు... వారు దాచిపెట్టిన నిజాలు కూడా ఆ పాటల రూపంలో బయటపడటం మొదలయ్యాయి. ఏళ్లుగా దాచిన రహస్యాలు... చెప్పకూడదనుకున్న అబద్ధాలు... మనసులో పెట్టుకున్న స్వార్థాలు... అన్నీ ఒక్కసారిగా ప్రపంచం ముందుకు వచ్చేయటం మొదలెట్టేశాయి. అసలు ఈ శాపం వెనుక రహస్యం ఏమిటి? గౌరి బాధకు కారణమైన వాళ్లకు ప్రకృతి ఇచ్చిన శిక్షేనా ఇది? అసలు ఏం జరిగింది..ఎందుకు ఆ ఊళ్లో వాళ్లు మాట్లాడలేకపోతున్నారు? ఒక చెట్టు కోసం ఏడ్చిన అమ్మాయి కథగా మొదలై... మనిషి అత్యాశ, ప్రకృతి ప్రతీకారం, మనసును కదిలించే భావోద్వేగాలతో సాగిపోయే ఈ కథ చివరకు ఏమైందో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎనాలిసిస్ చరిత్రలో కొన్ని సినిమాలు కథల వల్ల గుర్తుంటాయి. కొన్ని పాత్రల వల్ల గుర్తుంటాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ఒకే ఒక్క ప్రశ్న వల్ల గుర్తుండిపోతాయి. "ఇలా కూడా సినిమా తీయచ్చా?" "సింగ్ గీతం" చూసిన తర్వాత మనసులో మెదిలే మొదటి ఆలోచన ఇదే. సాధారణంగా మన ఇండియన్ సినిమా కథ చెప్పడానికి డైలాగ్‌లను వాడుతుంది. కొన్నిసార్లు పాటలు వస్తాయి. కానీ "సింగ్ గీతం"లో పరిస్థితి పూర్తిగా తలకిందులవుతుంది. ఇక్కడ పాటలు కథలో అప్పుడప్పుడూ రావు. పాటలతోనే కథను నడుస్తుంది. ఇదే ఈ సినిమా యొక్క అతి పెద్ద ప్రయోగం, సాహసం. ప్రపంచ సినిమా చరిత్రను చూస్తే, గొప్ప దర్శకులు ఎప్పుడూ కథలను కాదు, కథ చెప్పే విధానాన్ని ప్రశ్నించారు. Alfred Hitchcock ఒకసారి అన్నాడు: "Drama is life with the dull bits cut out." కానీ సింగీతం శ్రీనివాసరావు ఇక్కడ ఇంకో అడుగు ముందుకెళ్లారు. "డ్రామా అంటే డైలాగ్‌లే కావాలా?" అనే ప్రశ్న వేశాడు. ఈ సినిమా మొత్తం ఆ ప్రశ్నకు సమాధానం. ఒక గ్రామం. ఒక శాపం. ఇకపై మాటలు రావు. పాటలే వస్తాయి. కాగితంపై చదివితే ఇది ఒక లైన్ ఐడియా. కానీ స్క్రీన్‌ప్లే స్థాయిలో చూస్తే ఇది దాదాపు సామాన్య దర్శకుడు ఊహించటానికి కూడా భయపడే రిస్క్. ఎందుకంటే సినిమా భాషలో అత్యంత శక్తివంతమైన ఆయుధం డైలాగ్. ఆ ఆయుధాన్నే తీసేసి కథ చెప్పడం అంటే దర్శకుడు తన రెండు చేతుల్ని కట్టేసుకుని బాక్సింగ్ రింగ్‌లోకి దిగినట్టే. "వాట్ ఇఫ్?" అనే స్క్రీన్‌రైటింగ్ మేజిక్ నమ్ముకున్నారు సింగీతం. "ఒక గ్రామం మొత్తం పాటలతో మాత్రమే మాట్లాడితే?" అని ఆలోచించి స్క్రిప్టు రాసారు. అందుకే మొదటి 40 నిమిషాలు చాలా కొత్తగా అనిపిస్తాయి. ప్రేక్షకుడు కథను చూడటం మానేసి, ఆ ప్రపంచాన్ని పరిశీలించడం మొదలుపెడతాడు. "ఇప్పుడు వీళ్లు ఎలా మాట్లాడతారు?" "కోపం ఎలా చూపిస్తారు?", "అబద్ధం ఎలా చెబుతారు?", "ప్రేమ ఎలా వ్యక్తపరుస్తారు?" అనే ఆసక్తి పెరుగుతుంది.అదే ప్లస్ అయ్యింది.. ఆ తర్వాతే కొంత బలహీన పడింది. ఏ కొత్త కాన్సెప్ట్కైనా ఒక సమస్య ఉంటుంది. Novelty Decay. అంటే కొత్తదనం క్రమంగా తగ్గిపోవడం. మొదటిసారి పాటల్లో మాట్లాడటం ఆశ్చర్యం. పదోసారి చూసేసరికి అలవాటు. ఇరవయ్యోసారి చూసేసరికి ప్రేక్షకుడు అడిగేది ఒకటే: "సరే... ఇప్పుడు కథ ఎక్కడికి వెళ్తుంది?". ఇక్కడే "సింగ్ గీతం" కొంత తడబడుతుంది. కాన్సెప్ట్‌ను ఎస్టాబ్లిష్ చేయడంలో గెలిచిన సినిమా... ఆ కాన్సెప్ట్ తర్వాత కథను వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం కొంత నెమ్మదిస్తుంది. సినిమా అసలు విషయం చివరి 20 నిమిషాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సినిమా తన కాన్సెప్ట్ నుంచి ఎమోషన్ వైపు మారుతుంది. ప్రేక్షకుడు పాటలను చూడటం ఆపేస్తాడు. పాత్రలను చూడటం మొదలుపెడతాడు.అక్కడే సినిమా సింగీతం హృదయం బయటపెడుతుంది. టెక్నికల్ గా... ఇక ఈ సినిమాలో మరో విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అదే మ్యూజిక్ . సంగీతం ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ కాదు... స్క్రీన్‌ప్లే. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. సాధారణంగా సంగీత దర్శకుడు భావోద్వేగాన్ని పెంచుతాడు. కానీ ఇక్కడ ఆయన పాత్ర వేరు. ఇక్కడ మ్యూజిక్ కథను మోస్తుంది. సినిమాలో అరగంట తర్వాత దాదాపు ప్రతి సంభాషణ పాట రూపంలోనే ఉంటుంది. అంటే డైలాగ్ రైటర్ చేసే పనిలో సగం బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్ మీద పడింది. ఈ విషయంలో దేవి పూర్తిగా సక్సెస్ అయ్యాడు. పాటలు చార్ట్‌బస్టర్స్ కాకపోయినా... సినిమా ప్రయోగాన్ని నమ్మించేంతగా పనిచేశాయి. మిగతా డిపార్టుమెంట్స్ తక్కువ చేసాయని కాదు.. సంగీతం అన్నింటినీ డామినేట్ చేసిందనేది నా మాట. ఆర్టిస్ట్ లు కొత్తవారైనా ఎవరూ కొత్తవారులా చేయకపోవటం సింగీతం గారి ప్రతిభే. ఫైనల్ థాట్ ఈ సినిమా చూస్తూంటే Hayao Miyazaki సినిమాలు గుర్తు వచ్చాయి. ఆయన చిత్రాల్లో కూడా ప్రకృతి ఎప్పుడూ నేపథ్యం కాదు. ఒక పాత్ర. "సింగ్ గీతం"లో కూడా ఆ చివరి చెట్టు కేవలం చెట్టు కాదు.అది మొత్తం ప్రకృతికి ప్రతీక. అది కూలినప్పుడు కూలేది ఒక మొక్క కాదు. ఒక నాగరికత. "సింగ్ గీతం" ఒక పర్ఫెక్ట్ సినిమా కాదు. కానీ అది చాలా అరుదైన సినిమా. సినిమా చూస్తూ మరీ ఎగిరి గంతులు వేయరు కానీ ఖచ్చితంగా మనస్సు కొన్ని సార్లు మెచ్చుకుంటుంది. ఎందుకంటే చాలా సినిమాలు ప్రేక్షకుడు కోరుకున్నది ఇస్తాయి. ఈ సినిమా మాత్రం ప్రేక్షకుడు ఊహించనిది ఇస్తుంది. అందుకే "సింగ్ గీతం" ఒక సినిమా కంటే ఎక్కువ. ఇది ఓ స్క్రీన్‌ప్లే ప్రయోగశాల. ప్రతీ ప్రయోగం అద్బుతంగా సక్సెస్ అవ్వాలని లేదు కానీ..ఫలితం మాత్రం తర్వాత తరాలకు పనికి వచ్చే పునాది అయితే వేస్తుంది.