
Minister Vasamsetti Subhash: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ప్రత్యేకంగా “లేబర్ అడ్డాలు” ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు
. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కార్మికులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా ఈ లేబర్ అడ్డాలను రూపొందిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ కేంద్రాలను విస్తరిస్తామని వెల్లడించారు. కార్మికులకు నీడ, తాగునీరు, వాష్‌రూమ్‌లు వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
ఉపాధి అవకాశాలను పెంచేందుకు కొత్త సాంకేతిక పరికరాల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక రోజు పని దొరకని కార్మికులను పెద్ద నిర్మాణ ప్రాజెక్టులు, నైపుణ్యాధారిత ఉపాధి కేంద్రాలకు తీసుకెళ్లి వారికి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీంతో కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు, అన్నా క్యాంటీన్లతో ఈ లేబర్ అడ్డాలను అనుసంధానం చేసి కార్మికులకు తక్కువ ధరలో ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసి, లేబర్ అడ్డాలను నోడల్ పాయింట్లుగా మార్చే ప్రణాళిక ఉందన్నారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారికి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు.