
ప్రజలు కేవలం ఓటే కాదు, చరిత్ర రాస్తారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి
, సంక్షేమం పేరుతో తిరుపతి (Tirupati) సమీపంలోని దామినేడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు వచ్చాయని, ఆ తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం కలిగించిందన్నారు. ప్రజలు మౌనంగా కనిపించినా చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. రెండేళ్ల క్రితం కేవలం అధికారం కాదు, బాధ్యత ఇచ్చారు. చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం ఇది. ఏపీ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి ఇది. అధికారం పంచుకోవడానికి కాదు, బాధ్యత పంచుకునేందుకు కూటమి ఏర్పడింది. కూటమిలో జనసేన (Janasena) 21 సీట్లతో సరిపెట్టుకున్న సందర్భంలో చాలామంది విమర్శించారు. కానీ, ప్రజల ఆశీర్వాదంతో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్ధతో పనిచేస్తున్నాం. ఎన్నికైన ప్రధాని (Prime Minister)గా నిరంతరాయంగా సుదర్ఘీకాలంగా కొనసాగిన మోదీకి అభినందనలు. ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగాం. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే అని అన్నారు.