ప్రీ వర్కౌట్ సెషన్ జరుగుతున్న సమయంలో ఓ జిమ్ యజమానిపై కాల్పులతో తెగబడ్డ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హన్సీ పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో జిమ్ యజమాని మృతిచెందగా, ఓ యువతి కూడా
గాయపడింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది.పోలీసుల వివరాల మేరకు.. జింద్ జిల్లాకు చెందిన కపిల్ రెడు (25) హన్సీలోని క్రాంతికారి చౌక్ సమీపంలో జిమ్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం 5:30 గంటల సమయంలో కపిల్ తన క్లయింట్స్‌తో కలిసి ఫవ్వారా చౌక్ సమీపంలోని షాపుల ముందు మెట్లపై మార్నింగ్ ప్రీ వర్కౌట్ సెషన్ నిర్వహిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కపిల్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దుండగులు ఏకంగా పది రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో కపిల్ తల, వీపునకు బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు. ప్రీ వర్కౌట్ సెషన్లో పాల్గొన్న శిఖా అనే యువతికి కూడా కాల్పుల సమయంలో స్వల్ప గాయాలయ్యాయి. దాంతో ఆమెను హిసార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో హరి బాక్సర్ అనే వ్యక్తి ఈ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. అతడు తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నాడు. కపిల్ రెడు 2025 ఫిబ్రవరిలో జరిగిన షేఖ్‌పురా, ధాని పురియా కాల్పుల ఘటనల్లో కీలక కుట్రదారుడని అందుకే చంపేశామని పేర్కొన్నాడు. మరణించిన కపిల్ రెడుపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని హాన్సీ ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఒక దాడి కేసు, రెండు హత్య కేసులతో పాటు అక్రమ ఆయుధాల కేసు కూడా ఉందని చెప్పారు. ఈ కేసులన్నింటిలోనూ అరెస్టయ్యి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడని, ఈ లోపే ఇలా హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.