
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడనున్నట్లు కన్పిస్తుంది. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. దీంతో ఈ
వారాంతంలో ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. ఓవెల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌తో గొప్ప ఒప్పందాన్ని (USA- Iran Deal) కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇది తుది దశలో ఉందన్నారు. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఆ దేశం అంగీకరించిందని తెలిపారు. ఈ ఒప్పందంతో అది ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగిఉండదన్నారు. డీల్‌పై సంతకాల తర్వాత హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందన్నారు. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై నెలకొన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ ఆమోదించారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. యూరప్‌లో ఈ వారాంతంలో డీల్‌పై సంతకాలు జరగొచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఒప్పందం విషయంపై ఇరాన్ విభిన్నమైన ప్రకటన చేసింది. దీనిపై తాము ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి పేర్కొన్నారు. ట్రంప్ మాత్రం ఈ వారంలోనే డీల్‌పై సంతకాలు జరుగుతాయని ప్రకటించగా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu), ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఇరాన్ డీల్ విషయంపై నెతన్యాహు ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించిన విషయాలను ఇరువురి నేతలు చర్చించుకున్నారు. ఈ డీల్‌లో ఇజ్రాయెల్ భాగం కాదని ఆ దేశ ప్రధాన కార్యాలయం పేర్కొంది. అయినప్పటికీ.. సుసంపన్నమైన యురేనియంను తొలగించడం, క్షిపణి ఉత్పత్తులపై పరిమితులు విధించడం వంటి అంశాలు తుది ఒప్పందంలో ఉంటాయని ట్రంప్ హామీ ఇచ్చినట్లు తెలిపింది.
భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. భారతీయుల మృతికి కారణమైన ఈ దాడులను క్రూరమైనవిగా బఘాయీ అభివర్ణించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేశారు. ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పుతో పాటు.. నౌకాయాన స్వేచ్ఛకు అంతరాయం కలిగిస్తోన్న అమెరికా చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.