ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమలోని మిగిలిన జిల్లాలు
, కోస్తాంధ్రలోని జిల్లాలను రుతుపవనాలు తాకాయి. రెండు, మూడురోజుల్లో ఉత్తరాంధ్రలోని జిల్లాలకు రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఇటుబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇటు తెలంగాణ మీద నుంచి దక్షిణకోస్తాపై మరో ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణశాఖ. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వానలు పడే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరుతో పాటుగా మరికొన్ని రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాలకు తేలికపాటి వానలు పడతాయంటున్నారు. వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని.. ప్రజలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు విజయవాడలో భారీ వర్షం పడింది. ఎన్టీఆర్, ఏలూరు, బాపట్ల, , కృష్ణా, గుంటూరు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. విజయవాడలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతుందని వాతావరణశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. జూన్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో సాధారణం కన్నా ఎక్కువ వానలు పడతాయని భావిస్తున్నారు. రైతులు ఖరీఫ్ సాగును ముందుగానే చేపట్టాలని వ్యవసాయశాఖ సూచించిన సంగతి తెలిసిందే. రైతులు వ్యవసాయ పనుల్ని మరింత వేగవంతం చేశారు. పంట కాలువలకు నీటి విడుదలపై ప్రభుత్వం షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించింది.