
అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్ - రెండు స్తంభాలు విరిగిపడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలు జూలూరుపాడు, జూన్ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మట్టి మాఫియా ఆగడాలు
- అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్
- రెండు స్తంభాలు విరిగిపడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
జూలూరుపాడు, జూన్ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించాయి. అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలైన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ సరైన సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అనంతారం గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు నల్లబండ బోడు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు మట్టిని ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో మట్టి లోడుతో వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి అనంతారం గ్రామ సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ధాటికి రెండు విద్యుత్ స్తంభాలు విరిగి ట్రాక్టర్‌పై పడ్డాయి. అదే సమయంలో విద్యుత్ తీగలు డ్రైవర్‌పై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. మంటలు వ్యాపిస్తున్న క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులు కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ ని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
గత ఏడాది కాలంగా జూలూరుపాడు మండల పరిధిలోని నల్లబండ బోడు నుంచి చీమలపాడు గుట్టల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర సీతారామ ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న మట్టిని ఇష్టారాజ్యంగా అక్రమార్కులు తవ్వేస్తున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో, సెలవు దినాల్లో జేసీబీల సాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయించి ధనార్జనే ధ్యేయంగా దండుకుంటున్నారు. ఈ దందా నిరాటంకంగా సాగుతున్నప్పటికీ.. అటు ప్రభుత్వ యంత్రాంగం, అటు సీతారామ ప్రాజెక్టు అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే మట్టి మాఫియా రెచ్చిపోతోందని స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నా పట్టింపు లేకపోవడం పట్ల మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ప్రాణనష్టం సంభవిస్తే కానీ అధికారులు స్పందించరా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.