
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే సమయంలో లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడులతో పరిస్దితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్ధావరాలపైనా ఇరాన్ దాడుల్ని తిరిగి
మొదలుపెట్టింది. దీంతో అమెరికా కూడా ఇరాన్ పై ప్రతిదాడులు చేస్తోంది. ఇందులో భాగంగా హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తుండటం, అందులో భారత (India) సిబ్బంది ముగ్గురు మృత్యువాత పడటం, మరికొందరు చిక్కుకుపోవడం మనకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై కేంద్రం ఇవాళ తీవ్రంగా స్పందించింది.గత కొద్ది రోజులుగా గల్ఫ్‌లో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్లపై జరిగిన దాడులను కేంద్రం ఇవాళ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను తీవ్ర ఆందోళనకరమైనవిగా అభివర్ణించింది. ఈ మేరకు వెంటనే దాడులను నిలిపివేయాలని విదేశాంగశాఖ అమెరికాకు పిలుపునిచ్చింది. ఈ వారం ప్రారంభంలో ఒమన్ తీరంలో అమెరికా దళాలు ఒక నౌకపై దాడి చేయడంతో, మొదట గల్లంతైనట్లుగా వార్తలు వచ్చిన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు తేలింది.కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో భారతీయ నావికులకు సంబంధించి అనేక సంఘటనలు జరిగాయని, నావికుల సంక్షేమానికి, శ్రేయస్సుకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయాన్ని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. నిన్న, ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిని కూడా ఖండించామని, ఈ దాడిలో దురదృష్టవశాత్తు ముగ్గురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. తమ తీవ్ర నిరసనను తెలియజేయడానికి అమెరికా భద్రతాధిపతిని ఇక్కడికి పిలిపించామన్నారు. ఈ ప్రాంతంలో సంఘర్షణకు దాడులు ప్రత్యక్ష ఫలితమని, ఇవి తప్పక ఆగిపోవాలని జైశ్వాల్ కోరారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి, స్థిరత్వం తిరిగి రావడానికి చర్చలు, దౌత్యం జరపాలని పిలుపునిచ్చారు.