
FIFA World Cup 2026 in India:ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఫుట్‌బాల్ అభిమానులకు ఇది ఒక పండుగలా
భావిస్తారు. భారత్‌లో కూడా ఈ టోర్నమెంట్‌పై భారీ ఆసక్తి కనిపిస్తోంది. అభిమానులు తమ అభిమాన జట్లకు మద్దతు ఇస్తూ మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈసారి ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను జీ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. దీంతో టెలివిజన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా కొత్త స్పోర్ట్స్ ఛానెల్‌లను కూడా ప్రారంభించింది.
మ్యాచ్‌లను జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా వీక్షించవచ్చు. అయితే ఇందుకు చెల్లింపు సభ్యత్వం అవసరం. మూడు నెలల ప్లాన్, వార్షిక ప్లాన్ వంటి ఎంపికలను సంస్థ అందిస్తోంది. సబ్స్క్రిప్షన్ ఉన్నవారు అన్ని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
జీ ఛానెల్‌లు లేదా జీ5 సభ్యత్వం లేని వారికి కూడా శుభవార్త ఉంది. ప్రభుత్వ ప్రసార సంస్థ డీడీ స్పోర్ట్స్ కొన్ని కీలక మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనుంది. ముఖ్యంగా డీడీ ఫ్రీ డిష్ వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లను కూడా ఉచితంగా చూపించనుంది. దీంతో కీలక పోరాటాలను దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎలాంటి చెల్లింపు లేకుండా ఆస్వాదించవచ్చు.
ఈసారి ఫిఫా వరల్డ్ కప్ మరింత ప్రత్యేకంగా ఉండనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలోని అగ్ర జట్లు టైటిల్ కోసం పోటీపడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా నాకౌట్ దశ మ్యాచ్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫుట్‌బాల్ ప్రేమికులకు ఈ టోర్నమెంట్ ఒక అద్భుతమైన అనుభవంగా మారనుంది. ఉచిత ప్రసార సౌకర్యం అందుబాటులో ఉండటంతో మరింత మంది ప్రేక్షకులు వరల్డ్ కప్ ఉత్సాహాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది.