Punjab Farmers Viral Video : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చేతులెత్తేస్తే బాధితులు ఏం చేస్తారు? శారీరకంగా ధృడంగా ఉండి ఎవరినైనా అడ్డుకోగలమనుకుంటే కాపలా కాస్తారు. లేదు కాయలేము అనుకునే అమాయకులు
అయితే.. వస్తువులు, డబ్బులు పోతాయని నిత్యం ఏడుస్తూ ఉంటారు. అచ్చంగా ఇలాంటి కొందరు రైతులే తమ బాధ ప్రపంచానికి అర్థం అయ్యేలా చేశారు. ముఖ్యంగా తమ వ్యవసాయ క్షేత్రాల్లోంచి బోరు మోటార్లు పోవడంతో తట్టుకోలేకపోయారు. పంటలు వేసి నీళ్లు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడే మోటార్లు పోవడంతో.. పంట నాశనం కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అలా అని దొంగలను ఎదురించే స్థాయిలో లేని వీళ్లు.. బోరు మోటార్ల వద్ద "మోటార్లు ఎత్తుకెళ్లొద్దు.. మీ ఖాతా నంబర్లు ఇక్కడ పెట్టిపోతే నేరుగా మేమే డబ్బులు వేస్తాం" అని రాసి పెట్టారు. రైతులంతా ఇదే పని చేయగా.. ఇప్పడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..?పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లా పఖి కలాన్ గ్రామానికి చెందిన రైతులంతా ఒక్క చోటకు చేరి ఒక వినూత్న విజ్ఞప్తిని తెరపైకి తెచ్చారు. "ప్రస్తుతం వరి సాగు సీజను మొదలైంది. ఈ సమయంలో మాకు నీటి మోటార్లు ఎంతో ముఖ్యం. దయచేసి మా నీటి మోటార్ల జోలికి రాకండి. మీరు వెంటనే ఏదైనా ఒక బ్యాంకులో ఖాతా తెరిచి, ఆ వివరాలను మాకు పంపించండి. మేము ప్రతి నెలా మా పంటల రక్షణ నిధిగా అందులో నేరుగా డబ్బులు జమ చేస్తాం" అంటూ అన్నదాతలు ఆ వీడియోలో దొంగలను వేడుకోవడం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. దొంగలకు నేరుగా లంచం ఆఫర్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ నిరసన వెనుక అన్నదాతల ఆవేదన, రక్షణ కరువైన వైనం స్పష్టంగా కనిపిస్తుండగా.. చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఒకే రాత్రి 25 బైకులు మాయం..!రైతులు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా వారు అనుభవిస్తున్న నరకయాతన వల్లే వారు ఈ రకమైన వీడియో చేశారు. పఖి కలాన్ గ్రామ పరిధిలోని పొలాల నుంచి ఒకేసారి 15 నీటి మోటార్లు అపహరణకు గురయ్యాయి. ఆ నష్టం నుంచి రైతులు కోలుకోకముందే.. దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రైతులు తమ పొలాల వద్ద పార్క్ చేసిన 25 ద్విచక్ర వాహనాలను ఒక్క రాత్రిలోనే దొంగిలించుకుపోయారు. వరుస దొంగతనాలతో లక్షల్లో నష్టం వాటిల్లడంతో దిక్కుతోచని రైతులు పోలీసులను ఆశ్రయించారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ స్థానిక పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు,. కనీసం వాళ్లు పెట్రోలింగ్ కూడా పెంచలేదు. దీంతో శాంతిభద్రతల పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. పంటలు సాగు చేసుకోవడానికి, తమ ఆస్తులను కాపాడుకోవడానికి దొంగలతోనే నేరుగా 'రక్షణ ఒప్పందం' కుదుర్చుకోవడం మినహా తమకు మరో మార్గం తోచలేదని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వైరల్ వీడియో ఇప్పుడు పంజాబ్ పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దొంగలను పట్టుకోవాలని, రైతులకు భద్రత కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.