
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియాతో ప్రత్యేకంగా నిర్వహించిన
చిట్ చాట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. ఇంకా ఈ చిట్ చాట్ లో అమిత్ షా దేశ రాజకీయాలు, నియోజకవర్గాలపునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వ్యూహాలు సహా పలు కీలక, సంచలన విషయాలు చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదన్న ఆయన.. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం లోక్సభలో ఆయా రాష్ట్రాలకు ఉన్న నిష్పత్తిని ఏమాత్రం దెబ్బతీయకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లులో పొందుపరిచినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. మహిళా రిజర్వేషన్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో పెండింగ్లో ఉందని, అవసరమైన రాజకీయ మద్దతు లభించగానే దీనిని ఆమోదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
ఇక దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై మాట్లాడిన అమిత్ షా.. ప్రస్తుతం ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోందని తెలిపారు. కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే.. దానికి సంబంధించిన బిల్లుకు పార్లమెంట్లో అవసరమైన మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలోని ప్రాంతీయ పార్టీల సంబంధాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జెడియు , టిడిపి, శివసేన సహా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ పూర్తి సంతృప్తితో ఉన్నాయని, తమ వల్ల ఏ ప్రాంతీయ పార్టీకీ ఎలాంటి ఇబ్బందీ లేదనీ అమిత్ షా చెప్పారు. అక్కడితో ఆగకుండా.. భవిష్యత్తులో కొత్తగా మరే ఇతర ప్రాంతీయ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ముందు ముందు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సొంత బలంతో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్న అమిత్ షా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కుండబద్దలు కొట్టేశారు. అలాగే.. పంజాబ్లో సైతం శిరోమణి అకాలీదళ్ సహా ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని, అక్కడ ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ తప్పనిసరిగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు. దేశ సరిహద్దు ప్రాంతాల భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నామని, సరిహద్దులన్నింటినీ కట్టుదిట్టంగా ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా.. మోదీ 12 ఏళ్ళ పాలన ముగిసిన వేళ అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు అటు జాతీయ రాజకీయాల్లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
.