
గతేడాది అక్టోబరులో దెబ్బతీసిన మొంథా 4.19 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం రూ.411 కోట్ల సాయం కోసం రైతుల ఎదురుచూపులు ఈనాడు, అమరావతి: మొంథా తుపాను గతేడాది అక్టోబరులో 25 జిల్లాల పరిధిలోని
4.19 లక్షల ఎకరాలను నీటముంచింది. రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం పంటనష్టం వివరాలూ తయారు చేసింది. అయితే ఇప్పటి వరకు పెట్టుబడి రాయితీ విడుదల చేయలేదు. సుమారు ఏడున్నర నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ పంటల నష్టానికి సంబంధించి రూ.390 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.20.92 కోట్లు, మల్బరీ తోటల నష్టానికి రూ.4.43 లక్షలు పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం లెక్క తేల్చింది. ఎప్పుడిస్తారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ మొదలవుతున్న నేపథ్యంలో అయినా విడుదల చేస్తే పెట్టుబడులకు ఉపయోగపడుతుందని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 4.03 లక్షల ఎకరాల్లో సాగైన 24 రకాల వ్యవసాయ పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. 3,32,787 ఎకరాల్లో వరి దెబ్బతిందని గుర్తించారు. కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది.
36 వేల ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లింది. ప్రకాశం, ఎన్టీఆర్, పల్నాడు, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల పత్తి దెబ్బతింది. ప్రకాశం జిల్లాలో సజ్జ పంటకూ నష్టం జరిగింది.
దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల విస్తీర్ణం: 4,19,212 ఎకరాలు
ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ: రూ.411 కోట్లు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.