
ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ (US Apache) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ధ్వంసమవగా.. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. హర్మూజ్‌పై ఇరాన్ విధించిన దిగ్బంధనాన్ని ఛేదించే ప్రయత్నాల్లో భాగంగా, యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) అపాచీ హెలికాప్టర్లతో పాటు ఫైటర్ జెట్లు, డ్రోన్లతో పహారా కాస్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలోనే రీపర్ డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో.. అపాచీ హెలికాప్టర్ ఇరాన్ కాల్పుల్లో కూలిపోయిందా లేదా ఏదైనా సాంకేతికలోపం తలెత్తిందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటినుంచి యూఎస్ సైనిక హెలికాప్టర్ కూలిపోవడం ఇదే మొదటిసారి.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల వల్ల ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనమైందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం టెహ్రాన్ వద్ద 21శాతం మాత్రమే క్షిపణి సామర్థ్యం ఉందన్నారు. మళ్లీ దాడులు ప్రారంభిస్తే ఇరాన్ దురాక్రమణను ఎదుర్కోవడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. మరోవైపు ఈ యుద్ధంలో అగ్రరాజ్యం సైతం భారీ నష్టాన్ని చవిచూసిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 13 మంది అమెరికన్ సైనికులు మరణించగా.. 399 మంది గాయపడ్డారని వెల్లడించింది. అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయని తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.