Sukhendu Sekhar Roy Resign : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత పార్టీలో చెలరేగిన తిరుగుబాటు కాస్తా
ఇప్పుడు పార్లమెంట్ వరకూ పాకింది. టీఎంసీలో అత్యంత వాక్చాతుర్యం కలిగిన సీనియర్ పార్లమెంటేరియన్, నమ్మకస్థుడైన నాయకుడిగా పేరొందిన సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఊహించని విధంగా రాజీనామా చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో తన సుదీర్ఘ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.మమతకు రాసిన లేఖలో ఘాటు విమర్శలు..!తన రాజీనామా లేఖను సుఖేందు శేఖర్ రాయ్ నేరుగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపారు. ఆ లేఖలో ఆయన టీఎంసీ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. మహిళలపై తీవ్ర అణచివేత సాగింది. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ దారుణమైన అరాచక పాలనను బెంగాల్ ప్రజలు ముక్తకంఠంతో తిరస్కరించారు" అని లేఖలో ఘాటుగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారని కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కొత్తగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం అప్పుడే పక్కా ప్రణాళికతో చర్యలు ప్రారంభించిందని సుఖేందు అభినందించారు.ఎంపీ కోయల్ మల్లిక్ కూడా రాజీనామా?బెంగాల్ అసెంబ్లీలో ఇప్పటికే టీఎంసీకి చెందిన 61 మంది తిరుగుబాటు (రెబల్) ఎమ్మెల్యేలు అసమ్మతి నేత రితబ్రతకు మద్దతు ప్రకటించారు. దీంతో స్పీకర్ సైతం రితబ్రతను శాసన సభలో అధికారిక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. ఈ అసమ్మతి ఎమ్మెల్యేలతో కనీసం ఐదారుగురు టీఎంసీ ఎంపీలు నిరంతరం టచ్లోకి వెళ్లారని వార్తలు వస్తున్న తరుణంలోనే సుఖేందు రాజీనామా చేయడం గమనార్హం. ఆయన బాటలోనే మరో సీనియర్ ఎంపీ కోయల్ మల్లిక్ కూడా త్వరలోనే తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన విపక్షాల ‘ఇండియా’ కూటమి కీలక సమావేశానికి హాజరు అయ్యేందుకు మమతా బెనర్జీ దేశ రాజధానికి చేరుకున్న సమయంలోనే.. ఈ రాజకీయ భూకంపం సంభవించడం టీఎంసీకి కోలుకోలేని దెబ్బగా మారింది.