భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో రిషభ్ పంత్ కొట్టిన బంతి.. డ్రోన్ కెమెరాకు
తగిలినట్లు ఉంది. బంతి బలంగా తాకడంతో డ్రోన్ కెమెరా గ్రౌండ్‌లోనే కుప్పకూలినట్లు కూడా అందులో కనిపించింది. ఈ వీడియోను అభిమానులు షేర్లు చేస్తూ.. అరరె పంత్ సరిగ్గా గురి చూసి డ్రోన్‌ను పడగొట్టాడుగా అని కామెంట్లు చేస్తున్నారు.ఈ దృశ్యాలను చూసి చాలా మంది క్రికెట్ అభిమానులు ఇది నిజమేనేమో అని అనుకుంటున్నారు. కానీ అసలు విషయానికి వస్తే.. ఇది ఏఐతో రూపొందించిన వీడియో. సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన ఈ ఫేక్ కంటెంట్ నెటిజన్లను తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తోంది.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో తయారు చేసిన వీడియో అని ఈజీగా అర్థం అవుతోంది. ఎందుకంటే టెస్టు క్రికెట్ మ్యాచ్‌లలో ఎరుపు రంగు బంతిని ఉపయోగిస్తారు. అందుకే ఈ ఫార్మాట్‌ను రెడ్ బాల్ క్రికెట్ అని అంటారు. కానీ ఈ వైరల్ వీడియోలో మాత్రం రిషభ్ పంత్ కొట్టినట్లు చూపిస్తున్న బంతి తెలుపు రంగులో ఉంది. దానికి తోడు బంతి తగిలి డ్రోన్ కింద పడిన తర్వాత అక్కడ ఒక బంతి పక్కకు వెళ్లిపోగా, అదే సమయంలో డ్రోన్ లోపలి నుండి మరో బంతి అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది. అలా కింద పడగానే ఒకేచోట రెండు బంతులు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో ఇది ఏఐ వీడియో అని స్పష్టంగా రుజువైంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 564/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చింది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు చేశారు. రిషభ్ పంత్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు కొట్టారు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్ఘాన్.. 113/5తో నిలిచి పీకల్లోతు కష్టాల్లో పడింది.