Tax Notice: దేశంలో డిజిటల్ లావాదేవీలు ఎంత వేగంగా పెరుగుతున్నా అసంఘటిత రంగంలో ఇప్పటికీ నగదు ట్రాన్సాక్షన్లదే పైచేయిగా చెప్పవచ్చు. అయితే, ఐటీ రిటర్నులలో చూపించే ఆదాయానికి, బ్యాంక్ ఖాతాల్లోజరిగే క్యాష్
డిపాజిట్లకు పొంతన లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే రంగంలోకి దిగుతుంది. ఇలాంటి ఒక కేసులో బ్యాంక్ ఖాతాలో రూ.1.28 కోట్ల నగదు డిపాజిట్ చేసి కేవలం రూ.3 లక్షల వార్షిక ఆదాయాన్ని ప్రకటించిన ఒక పాత సామాన్య వ్యాపారికి ఐటీ శాఖ ఐటీ శాఖ ఏకంగా రూ.44 లక్షల భారీ పన్ను నోటీసులు పంపించింది. కానీ, ఈ వివాదంలో ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యుణల్ పుణే బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. అది చిన్న వ్యాపారులకు పెద్ద ఊరటగా మారింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. అసలేం జరిగిందంటే?వజీద్ ఖాన్ అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా స్క్రాప్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్థిక సంవత్సరం 2015-16కు గాను తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో కేవలం ర.3,00,340 వార్షిక ఆదాయాన్ని ప్రకటించారు. అయితే, ఐటీ శాఖకు చెందిన అధునాత ఇన్సైట్ పోర్టల్ ఆయన కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాను స్కానింగ్ చేయగా అందులో ఏకంగా రూ.1,28,26,078 క్యాష్ డిపాజిట్ అయినట్లు గుర్తించింది. ఆదాయానికి, డిపాజిట్‌కు భారీ వ్యత్యాసం ఉండడంతో ఐటీ అధికారులు సెక్షన్ 147 కింద ఈ కేసును రీ-ఓపెన్ చేశారు. స్క్రాప్ డీలర్‌కి రూ.44 లక్షలు పన్ను డిమాండ్ నోటీసులు పంపించారు.ఐటీ అధికారుల నోటీసులకు స్పందిస్తూ తనది పాత సామాన్య వ్యాపారమని, ఇందులో అన్నీ నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతాయని వజీద్ ఖాన్ వివరణ ఇచ్చారు. ప్రిజంప్టివ్ టాక్సేషన్ కింద టర్నోవర్ లో 8 శాతం లాభాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే, దురదృష్టవశాత్తూ తన కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ కు వైరస్ సోకడం వల్ల అకౌంటింగ్ డేటా మొత్తం డిలీట్ అయిపోయిందని, అందుకే పూర్తి బిల్లులు సమర్పించలేకపోతున్నానని ఆయన తెలిపారు. సదరు వ్యాపార దగ్గర తగిన రికార్డులు లేకపోవడంతో అసెస్సింగ్ ఆఫీరస్ ఆ వివరణను తోసిపుచ్చారు. రూ.1.28 కోట్ల మొత్తాన్ని అన్ ఎక్స్‌ప్లైన్డ్ మనీ గా పరిగణనించి దానిని సెక్షన్ 115బీబీఈ కింద జరిమానాలతో కలిపి దాదాపు రూ.44 లక్షల ట్యాక్స్ డిమాండ్ విధించారు. మొదటి అప్పీలులో కూడా ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు.ట్రైబ్యునల్ కీలక తీర్పువ్యాపారి ఐటీఏటీ ని ఆశ్రియంచడంతో ఈ కేసు ఊహించని మలుపు తిప్పింది. వజీద్ ఖాన్ తన పాత, తర్వాత సంవత్సరాల ఐటీ అసెస్మెంట్ రికార్డులను ట్రైబ్యునల్ ముందు ఉంచారు. ఆయా సంవత్సరాల్లో కూడా తన బిజినెస్ మోడల్ ఇలాగే ఉందని, అప్పుడు ఐటీ శాఖ తన 8 శాతం ప్రాఫిట్ ఎస్టిమేషన్ పద్ధతిని ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించినట్లు నిరూపించారు. దీనిపై విచారణ జరిపిన ఐటీఏటీ బెంచ్, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ల్యాండ్ మార్క్ తీర్పులను ఉటంకిస్తూ ప్రిన్సిపల్ ఆఫ్ కన్సిస్టెన్సీ ను తెరపైకి తెచ్చింది. ఒకే వ్యాపార శైలిని, అకౌంటింగ్ పద్ధతిని ఐటీ శాఖ గతంలోనూ, మున్ముందూ ఆమోదించినప్పుడు కేవలం ఒక సంవత్సరంలో రికార్డులు లేవనే కారణంతో మొత్తం డిపాజిట్లను అక్రమ ఆదాయంగా భావించడం సరికాదని స్పష్టం చేసింది. పాత రికార్డుల ఆధారంగా వ్యాపార స్వభావాన్ని అంచనా వేయాలని పేర్కంటూ, గతంలో విధించిన రూ.44 లక్షల పన్ను ఆర్డర్‌ను ట్రైబ్యునల్ రద్దు చేసింది. ఈ కేసును తిరిగి మొదటి నుంచి పరిశీలించి, గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న లాభాల అంచనా పద్ధతి ప్రకారమే పన్నును లెక్కించాలని అసెస్సింగ్ ఆఫీసర్‌కు కేసును రీ రిఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు నగదు రూపంలో వ్యాపారాలు చేసే చిన్న సన్నకారు వ్యాపారులకు పెద్ద ఊరటనిస్తుంది. అయితే, ట్యాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిసారీ ఇలాంటి మినహాయింపులు దక్కకపోవచ్చు. కాబట్టి వ్యాపారులు, డిజిటల్ రికార్డులతో పాటు క్యాష్ బుక్స్, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్లను సురక్షితంగా ఉంచుకోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.