ఏపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు టీడీపీలో అసంతృప్తికి కారణమవుతోంది. ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో మూడు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నాయి. జనసేన నుంచి లింగమనేని రమేష్, టీడీపీ నుంచి చింతకాయల
విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్ బాబులకు అవకాశం దక్కింది. దీంతో రాజ్యసభ సీటు ఆశించిన సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పొలిట్‌బ్యూరో నేత, సీనియర్ లీడర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారంటూ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను" అంటూ శ్రీనివాసరెడ్డి ట్వీట్ చేశారు.మరోవైపు ఈ ట్వీట్ చేసిన మరికొద్దిసేపటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి. మీ కార్యక్రమం కోసం టీడీపీ కార్యకర్త సొంత నిధులు వెచ్చించారని.. అయితే ఇప్పటికే బిల్లులు చెల్లించలేదని అసంతృప్తి వెళ్లగక్కుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 డిసెంబర్ 7వ తేదీ కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పేరెంట్-టీచర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ చిట్టా శివారెడ్డి తన సొంత నిధులతో నిర్వహించారు.అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల వ్యయాల చెల్లింపుల కోసం ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని.. అయితే 18 నెలలు గడుస్తున్నా బిల్లులు విడుదల కాలేదని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ కార్యకర్త సొంత డబ్బులు ఖర్చు చేస్తే.. ఇలా నెలల తరబడి చెల్లించకుండా పెండింగ్ ఉంచటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల కోసం కార్యకర్తలు ముందుకొచ్చి తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను వెచ్చిస్తే.. వారికి న్యాయం జరగకపోతే రేపు ఏ కార్యకర్తను నమ్మకంతో ముందుకు రావాలని ఎలా చెప్పగలమని నిలదీశారు.అధికారిక కార్యక్రమం కోసం ఖర్చు చేసిన డబ్బులు తిరిగి పొందేందుకు ఒక కార్యకర్త కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు రావాలని రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా కూడా ఇప్పటి దాకా సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవని .. ఆ కార్యకర్త ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి తోడ్పడిన వ్యక్తికి ఇదేనా దక్కాల్సిన గౌరవం అంటూ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.