తాను యూసఫ్ పఠాన్‌ను మమతా బెనర్జీ తరఫున సంప్రదించి, ఎంపీ పదవికి రాజీనామా చేయమని కోరినట్టు వస్తున్న వార్తలను టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఖండించారు. తాను మమతకు మధ్యవర్తిగా వ్యవహరించానన్న
ఆరోపణలు అవాస్తవమని గంగూలీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తరపున రాయబారం నడిపిన గంగూలీ.. పఠాన్‌ను సంప్రదించి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికలో ఆమె పోటీ చేసేందుకు వీలుగా ఎంపీ పదవికి రాజీనామా చేయమని సందేశం పంపారు’’ అని ఓ నివేదిక ఆరోపించింది.‘‘పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తరఫున నేను యూసఫ్ పఠాన్‌ను సంప్రదించానని, ఆయన ఎంపీగా ఉన్న నియోజకవర్గం నుంచి ఉప-ఎన్నికల్లో బెనర్జీ పోటీచేయడానికి వీలుగా పదవికి రాజీనామా చేయాలనే ఆమె సందేశాన్ని నేను చేరవేశాననే ఆరోపణలు వచ్చాయి.. ఇవన్నీ పూర్తిగా అవాస్తవం’’ అని గంగూలీ కొట్టిపారేశారు. ఇవి బాధ్యతారాహిత్యమైన పుకార్లని, ఇటువంటి వార్తలను ప్రచురించడానికి ముందు నిర్దారించుకోడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయకపోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని అన్నారు. అంతేకాదు, మమతా బెనర్జీ కోసం తాను మధ్యవర్తిగా వ్యవహరించినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. అంతేకాదు, యూసఫ్ పఠాన్‌కు సందేశం చేరవేయాలని మమతా బెనర్జీ తనను ఎప్పుడూ కోరలేదని, ఈ విషయాన్ని రికార్డుల్లో ఉంచడం ఎంతైనా అవసరమని తెలిపారు.అసలు అటువంటి సంభాషణే జరగనప్పుడు, సదరు వార్తల్లో పేర్కొన్నట్లుగా పఠాన్ స్పందించాడనే ప్రశ్నే ‘ఉత్పన్నం కాదు, కాబోదు’ అని ఇండియా జట్టు మాజీ కెప్టెన్ పునరుద్ఘాటించారు. రాజకీయ వ్యవహారాలకు తాను దూరంగా ఉంటానని, ‘‘నేను ఏ దశలోనూ, ఎవరితోనూ రాజకీయ విషయాలలో పాలుపంచుకోలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.బహరంపూర్ లోక్‌సభ స్థానంపై నెలకొన్న ఊహాగానాల నడుమ మమతా ఉప-ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో గంగూలీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీతో పాటు మమతా బెనర్జీ కూడా ఓటమి చవిచూశారు.