
అంతా అనుకున్నట్లే జరిగింది! టీనేజ్ సంచలనం.. వైభవ్ సూర్యవంశీ.. టీమ్ఇండియా టీ20 జట్టులో స్థానం సంపాదించాడు. అదే సమయంలో మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీ కోల్పోవడంతోపాటు
.. ఏకంగా జట్టులో స్థానానికీ నోచుకోలేదు.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే టీమ్ఇండియా కొన్ని నెలల క్రితం టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. కానీ వ్యక్తిగత ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండటంతో అతడు జట్టులో స్థానం కోల్పోక తప్పలేదు. అతడి స్థానంలో తాజాగా శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా బీసీసీ సెలక్షన్ కమిటీ నియమించింది. తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. సూర్యకుమార్ ఫామ్‌లో లేకపోవడం వల్లే అతడిని తప్పించాల్సి వచ్చిందని శనివారం భారత జట్టును ప్రకటించిన అనంతరం చీఫ్ సెలక్టర్ అగార్కర్ అన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ తన చివరి 10 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 305 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. 84* పరుగులు అతడి అత్యధిక స్కోర్. అది కూడా అనామక యూఎస్ఏ మీద సాధించాడు. ఇక సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. అతడు చివరిగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా డిసెంబర్ 14, 2023 దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అప్పటి నుంచి అతడు భారీ ఇన్నింగ్స్‌లు చేయలేకపోతున్నాడు. దీంతో సూర్యకుమార్ చేజేతులా.. ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడని అభిమానులు వాపోతున్నారు.
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2026లోనూ పెద్దగా రాణించలేదు. 13 మ్యాచుల్లో అతడు కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. రెండుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. గత సీజన్లో మాత్రం అతడు 16 మ్యాచుల్లో తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యధికంగా 717 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలున్నాయి. అంతర్జాతీయ మ్యాచుల్లో రాణించనప్పటికీ అతడు టీమ్ఇండియాలో నిన్నమొన్నటి వరకు కొనసాగడానికి ఈ ప్రదర్శనే కారణమైందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే టీ20 వరల్డ్‌కప్ ముందు గిల్‌ను తప్పించి, సూర్యకుమార్‌ను మాత్రం కొనసాగించారు.
కానీ ఈ సారి ఐపీఎల్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోలేదు అని సెలక్టర్లు పైకి చెబుతున్నారు. అయినప్పటికీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయం వెనక ఈ టోర్నీలో సూర్య విఫలమవడం కూడా కారణంగానే తెలుస్తోంది.
టీ20 క్రికెట్లో టీమ్ఇండియాలో స్థానం కోసం యువక్రికెటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా ఐపీఎల్ ప్రదర్శనలతో పలువురు క్రికెటర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక సెలక్టర్లు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇలాంటి పోటీ పరిస్థితుల్లో సూర్యకుమార్ పునరాగమనం దాదాపు కష్టమే. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే.. అతడు తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకునే అవకాశం ఉంది. 35 సంవత్సరాల వయసులో కెరీర్ చరమాంకంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తిరిగి భారత జట్టులోకి రావాలంటే.. ఏదైనా అద్భుతమే జరగాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.