
జాతీయ స్ధాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) భారీ
ప్రదర్శన నిర్వహించింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున యువత తరలివచ్చారు. అయినా కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే (Abhijit Dipke) ఘాటుగా స్పందించారు.
ఇవాళ జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, వారం రోజుల్లో విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాలని, లేకపోతే ప్రధాని మోడీ ఆయనకు కేబినెట్ నుంచి తప్పించాలని సీజేపీ వ్యవస్ధాపకుడు అభిజిత్ దిప్కే డిమాండ్ చేశారు. ఇవాళ భారీ ప్రదర్శన ఊహించిన దాని కంటే సక్సెస్ కావడంతో సీజేపీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిరసన స్ఫూర్తిగా మరిన్ని ఆందోళనలకు పిలుపునిచ్చేందుకు వారు సిద్దమవుతున్నారు.
ఈ రోజు నిరసనలు ముగిసిన అనంతరం కాక్రోచ్ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ విలేకరుల సమావేశం నిర్వహించి, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. "ధర్మేంద్ర ప్రధాన్ 7 రోజుల్లోగా రాజీనామా చేయాలి లేదా ప్రధాని మోదీ ఆయన్ను తొలగించాలి" అని ఆయన అన్నారు. "ప్రస్తుతం విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడంపై గళం విప్పడమే తమ ప్రాధాన్యత" అని వెల్లడించారు. ఎన్నికల వదంతుల గురించి అడగ్గా, "ప్రస్తుతానికి తమకు ఎన్నికలలో పోటీ చేసే ప్రణాళికలు లేవన్నారు.