
దేశంలో వరుసగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ లు, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఇవాళ ఢిల్లీలో భారీ
నిరసనకు సిద్ధమైంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఈ నిరసనలో పాల్గొనేందుకు అమెరికాలో ఉంటున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయన అడుగుపెట్టినా బయటికి మాత్రం రాలేదు. మరోవైపు కాక్రోచ్ పార్టీ తమ నిరసనకు అనుమతి లభించినట్లు ప్రకటించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బొద్దింక వ్యాఖ్యల తర్వాత పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఆన్ లైన్ లో కేంద్రానికి వరుసగా ప్రశ్నలు వేయడం, వీడియోలతో చికాకు తెప్పించడం ప్రారంభించింది. దీంతో యువతలోనూ మద్దతు పెరుగుతూ వచ్చింది. ఇదే క్రమంలో కాక్రోచ్ పార్టీ ఇన్ స్టా, ఎక్స్ ఖాతాల్ని పలుమార్లు బ్లాక్ చేయడం, తిరిగి అన్ బ్లాక్ చేయడం కూడా జరిగాయి. దీంతో ఇక నేరుగా ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్న వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ముందుగా పార్టీకి ముగ్గురు అధికార ప్రతినిధుల్ని ప్రకటించారు. ఇందులో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, విజేత దహియా ఉన్నారు.
అనంతరం స్వయంగా జనంలోకి రావాలని నిర్ణయించిన అభిజీత్ దిప్కే.. ఢిల్లీలో ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చారు. తాను ఢిల్లీకి చేరుకుని పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ కు వెళ్లి జంతర్ మంతర్ నిరసనకు అనుమతి తీసుకుంటానని ప్రకటించారు. తొలుత ఎయిర్ పోర్టుకు తమ మద్దతుదారులు తరలిరావాలని కోరిన అభిజీత్.. ఆ తర్వాత పరిస్ధితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో వెనక్కి తగ్గారు. నేరుగా జంతర్ మంతర్ కు రావాలని మద్దతుదారుల్ని కోరారు. ఇవాళ అన్నట్లుగానే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అభిజీత్..కాసేపట్లో పీఎస్ కు వెళ్లనున్నారు. మరోవైపు తమ జంతర్ మంతర్ నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.