తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తి మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి స్టాంపులు
- రిజిస్ట్రేషన్ల శాఖ సవరించిన నూతన మార్కెట్ విలువలు శుక్రవారం (జూన్ 5) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. అయితే, రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో గల 66 గ్రామాల్లో మాత్రం సాగు భూముల మార్కెట్ విలువల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండా పాత ధరలనే యథాతథంగా కొనసాగించింది. ఈ జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, కరీంనగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి వంటి ప్రధాన జిల్లాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి, స్థానిక రైతాంగంపై అదనపు రిజిస్ట్రేషన్ భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. రియల్ ఎస్టేట్ డిమాండ్ విపరీతంగా ఉన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, శివారు జిల్లాలలో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్, పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో ఉన్న భూములకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ శివారులోని పుప్పాలగూడలో ఎకరా మార్కెట్ విలువ రూ.9 కోట్ల నుంచి ఏకంగా రూ.11 కోట్లకు చేరుకుంది. అలాగే చేవెళ్లలో రూ.33 లక్షల నుంచి రూ.84 లక్షలకు, కందుకూరులో రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లకు, కొత్తూరులో రూ.28 లక్షల నుంచి రూ.2.14 కోట్లకు మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించింది. ఈ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన, శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగానే ధరలను ఈ స్థాయిలో పెంచాల్సి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలను డిమాండ్‌ను బట్టి 15 శాతం, 25 శాతం చొప్పున వర్గీకరించి ధరలను పెంచారు. 15 శాతం పెంపుదల వర్తించే ప్రాంతాలలో మేడ్చల్ జిల్లాలోని తుర్కపల్లి, యాప్రాల్, చర్లపల్లి, కాప్రా, సింగాయిపల్లితో పాటు ఉప్పల్ పరిధిలోని బండ్లగూడ, ఫతూల్గూడ, మీర్‌పేట, నౌరంగ్‌గూడ భగత్, ఉప్పల్ కాల్సా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని దాయర, కాల్వంచ, రుద్రారం, మార్వెల్లి ప్రాంతాలలో కూడా 15 శాతం ధరలు పెరిగాయి. ఇక 25 శాతం మేర భారీగా ధరలు పెరిగిన ప్రాంతాలలో అల్వాల్, దమ్మాయిగూడ, కౌకూర్, మచ్చబొల్లారం, ఘట్కేసర్ పరిధిలోని అంకుషాపూర్, ఔషాపూర్, ఏదులాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం, జీడిమెట్ల, సూరారం, అలాగే ఉప్పల్ పరిధిలోని కొత్తేపేట, నాగోలు, రామంతాపూర్ వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని సాహెబ్‌నగర్, బైరామల్‌గూడ, చంపాపేట్, గడ్డిఅన్నారం, మన్సూరాబాద్, సరూర్‌నగర్, మదీనాగూడ, మరియు సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, ఇస్నాపూర్, పాశమైలారం, సదాశివపేట వంటి పారిశ్రామిక, నివాస ప్రాంతాలలో 25 శాతం మార్కెట్ విలువ పెరిగింది.ఇక ఇళ్లు, అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాల విషయానికి వస్తే ప్రభుత్వం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తూనే.. కొన్ని ప్రాంతాల్లో ధరలను సవరించింది. 8 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలోని వాణిజ్య బహుళ అంతస్తుల భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మార్కెట్ విలువను 11 శాతం మేర తగ్గించడం విశేషం. శేరిలింగంపల్లి, గండిపేట, శంషాబాద్, మేడ్చల్ పరిధిలో గతంలో గ్రౌండ్ ఫ్లోర్లో చదరపు అడుగుకు రూ.7,300 ఉండగా.. మిగిలిన అంతస్తుల్లో రూ.6,600 ఉండేది. తాజా సవరణలో అన్ని అంతస్తుల విలువను సమానంగా రూ.6,600 గా ఖరారు చేశారు. అలాగే వల్లభ్‌నగర్ పరిధిలో కూడా గ్రౌండ్ ఫ్లోర్ ధరను రూ.8,600 నుండి తగ్గించి మిగిలిన అంతస్తులతో సమానంగా రూ.7,800 గా నిర్ణయించారు. దీనికి భిన్నంగా పుప్పాలగూడ, నార్సింగి, ఆదిభట్లలోని నివాస అపార్టుమెంట్ల ధరలను చదరపు అడుగుకు రూ.2,200 నుండి రూ.2,700 కు, బంజారాహిల్స్ కమర్షియల్ భవనాల ధరను రూ.7,600 నుండి రూ.8,400 కు పెంచారు.సరికొత్త సవరణల ప్రకారం ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువలు చదరపు గజానికి ఈ విధంగా ఉన్నాయి కోకాపేట: రూ. 47,600 హబ్సిగూడ: రూ. 46,800 పుప్పాలగూడ: రూ. 36,800 అత్తాపూర్: రూ. 30,500 నార్సింగి: రూ. 27,000 నాచారం: రూ. 25,400 ఉప్పల్ / నాగోలు: రూ. 25,200 బైరామల్‌గూడ: రూ. 24,300 గండిపేట: రూ. 22,600 రావిరాల / కందుకూరు: రూ. 4,900 వేములవాడ: రూ. 4,800 జనగామ: రూ. 3,200