CMR Green IPO Subscription : భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నుంచి సూచీలు పడుతూనే ఉన్నాయి. మధ్యలో అమెరికా అధ్యక్షుడు
CMR Green IPO Subscription : భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నుంచి సూచీలు పడుతూనే ఉన్నాయి. మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యుద్ధం ముగింపుపై సానుకూల ప్రకటనలు చేసిన సమయాల్లో సూచీలు పుంజుకున్నాయి. ఇదే సమయంలో ఒకవైపు ఏఐ డిమాండ్ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఐటీ స్టాక్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలా మార్కెట్ అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో.. ఒకవైపు ఐపీఓల సందడి కూడా తగ్గింది. ఒకప్పటంత లేదు. ఈ ఏడాది ఇంకా మార్కెట్ పరిస్థితులు బాగోలేనందున పెద్ద పెద్ద కంపెనీల ఐపీఓలు కూడా లిస్టింగ్‌లో జాప్యం చేస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, NSE, ఓయో, జెప్టో ఇలా ఐపీఓలు రెండో అర్ధభాగంలోనో లేదా వచ్చే ఏడాదో వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు ఇప్పటికే రావాల్సి ఉంది. అయితే చాలా రోజులకు ఇప్పుడు ఒక ఐపీఓ వచ్చేసింది. ఇది ఇంకా మెయిన్ బోర్డ్ ఐపీఓనే. వస్తే ఊరుకుంటారా.. ఇన్వెస్టర్లు షేర్లను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలు చేయడం విశేషం. ఈ నాన్ ఫెర్రస్ లోహాల రీసైక్లర్ అయిన సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ శుక్రవారంతో ముగియగా.. 3 రోజుల్లో కలిపి ఏకంగా 127 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ లభించింది. ఎక్కువగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవల మార్కెట్లో ఎక్కువగా ఐపీఓలు రాని నేపథ్యంలో.. ఈ ఐపీఓకు ఇంత మంచి స్పందన లభించడం సానుకూలాంశంగా చెప్పొచ్చు. సీఎంఆర్ గ్రీన్ టెక్.. ఐపీఓ ద్వారా సుమారు రూ. 631 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ అందుబాటులో దాదాపు 2.30 కోట్ల షేర్లను ఉంచితే.. రికార్డు స్థాయిలో 292 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఐపీఓ ఇష్యూ ధరల శ్రేణి రూ. 182- 192 గా ఉంది. ఒక్కో లాట్ కింద కనీసం 78 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్పర్ ప్రైస్ రూ. 192 తో చూస్తే కనీస పెట్టుబడి రూ. 14,976 గా ఉంటుంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 188.44 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలోనే జరుగుతుంది. ఈ నెల 10న ఈ షేర్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానున్నాయి.