తీవ్ర అనారోగ్యంతో ఉన్న కొడుకును చూసుకోవడం కోసం ఉద్యోగాన్ని వదులుకోడానికి సిద్ధమైన ఉద్యోగికి యజమాని నుంచి ఊహించని మద్దతు లభించింది. రాజీనామాకు గల కారణాన్ని తెలుసుకున్న యజమాని.. నెల రోజులు వేతనంతో
తీవ్ర అనారోగ్యంతో ఉన్న కొడుకును చూసుకోవడం కోసం ఉద్యోగాన్ని వదులుకోడానికి సిద్ధమైన ఉద్యోగికి యజమాని నుంచి ఊహించని మద్దతు లభించింది. రాజీనామాకు గల కారణాన్ని తెలుసుకున్న యజమాని.. నెల రోజులు వేతనంతో కూడిన సెలవును ఇచ్చారు. అంతేకాదు, ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదని, ఈ సీటు మీకోసం వేచి ఉంటుందని ఉద్యోగికి ధైర్యం చెప్పారు. అంకిత్ పాండే అనే పేరుతో ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్న ఈ సంఘటన అందరి హృదయాలను హత్తుకుంటోంది. మానవత్వాన్ని చాటుకున్న ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అంకిత్ పాండే తమ సంస్థలో పనిచేసే అకౌంటెంట్ ఒకరు తన వద్దకు వచ్చి రాజీనామా చేస్తున్నానని చెప్పారని అన్నారు. ‘‘గత పది సంవత్సరాలు ఆయన మా దగ్గరే పనిచేస్తున్నాడు... అందుకే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది’’ అని చెబుతూ రాజీనామాకు గల కారణాన్ని అడిగినట్లు తెలిపారు. తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని, పూర్తి సమయం వాడితో ఉండాల్సిన పరిస్థితి రావడం వల్ల ఉద్యోగాన్ని వదిలేయక తప్పదని భావించి సదరు అకౌంటెంట్ తన రాజీనామాను సమర్పించాడని చెప్పారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ‘‘నా కొడుకు పరిస్థితి చాలా విషమంగా ఉంది సార్.. వాడు కోలుకునే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు చెప్పారు.. అందుకే నేను నా పూర్తి సమయాన్ని వాడితోనే గడపాలనుకుంటున్నాను’’ అన్నాడు... నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలరా? అని అడిగితే ప్రస్తుతానికి నా కొడుకుకు అన్నిటికంటే నేనే ఎక్కువ అవసరం అంటూ నిరాకరించాడు’’ అని పోస్ట్‌లో వివరించారు.‘‘నేను అతనితో సరే, మీ అబ్బాయిను దగ్గరుండి చూసుకోండి... మీ ఉద్యోగం మీ కోసమే వేచి ఉంటుంది, ఈ సీటును ఇలాగే ఉంచుతాను అని చెప్పాను..కానీ, 10 ఏళ్ల పాటు ఆయన చూపించిన విశ్వాసానికి ఈ కష్ట సమయంలో ఒంటరిగా వదిలేయడానికి నా మనసు అంగీకరించలేదు.. అందుకే డబ్బు గురించి అస్సలు ఆలోచింకండి.. ప్రతి నెల జీతం మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది.. మీరు నిశ్చింతంగా ఉండండి.. దగ్గరుండి కొడుకును చూసుకోండి.. వాడు పూర్తిగా కోలుకున్నాక తిరిగి రండి’’ అని చెప్పానని అన్నారు.నెల రోజుల తర్వాత ఆ ఉద్యోగి ఒక స్వీట్ బాక్స్ పట్టుకుని ఆఫీసులోకి వచ్చాడని, తన కొడుకు పూర్తిగా కోలుకున్నాడనే సంతోషకరమైన వార్తను పంచుకున్నాడని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను పని చేయని కాలానికి ఇచ్చిన వేతనాన్ని వాపసు తీసుకోవాలని కోరాడని చెప్పారు. కానీ, దీనిని సున్నితంగా తిరస్కరిస్తూ ‘‘మేము నీకు ఇచ్చింది జీతం కాదు. నీ కుమారుడు త్వరగా కోలుకోవాలని మా వంతుగా మేము అందించిన ఒక చిన్న సాయం.. కొన్నిసార్లు సంస్థ అనేది కేవలం పని చేసే ఆఫీసు మాత్రమే కాదు, అది ఒక కుటుంబం’’ అని అన్నాడు.సోషల్ మీడియాలో అంకిత్ పాండేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుందని మీరు నిరూపించారు.. ఎంతో నిస్వార్థమైన నిర్ణయం.. ఇది నిజంగానే ఆ చిన్నారి కోలుకోవడానికి సాయపడింది.. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా కొడుకుతో సమయాన్ని గడపగలిగాడు. మీ చిన్న సాయం (నిజానికి ఇది చాలా పెద్దది) అతనికి ఎంతో మేలు చేసింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బ్రో’’అని ఒకరు.. ‘ఇది గొప్ప మానవీయ దృక్పథం.. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగే చూసుకోవాలి, ఎందుకంటే ఆ సంస్థ ఎదుగుదల కోసం వారు కూడా అంతే కష్టపడతారు కదా’ అని మరొక యూజర్ పేర్కొన్నారు.