అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి పది రోజులు కూడా సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడే విషయంపై స్పష్టత లేదు. గాయాలతో ఇబ్బంది పడుతున్న ఈ ఇద్దరు ప్లేయర్లు.. సిరీస్ ప్రారంభానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ప్లేయర్లు ఒకవేళ ఈ సిరీస్‌కు దూరమైతే.. వీరిని భర్తీ చేసే ప్లేయర్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొందరు ప్లేయర్లు ముందు వరుసలో ఉన్నారు.ఈ జాబితాలో యశస్వి జైశ్వాల్ ముందు వరుసలో ఉన్నాడు. జైశ్వాల్.. తన చివరి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అజేయంగా 116 పరుగులు సాధించి, తనదైన ముద్ర వేశాడు. తన కెరీర్లో కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడినా.. వాటిల్లో 57.00 సగటుతో 171 పరుగులు సాధించాడు జైశ్వాల్. దేశవాళీల్లోనూ సత్తాచాటి.. వన్డే టీమ్‌లో చోటు కోసం రేసులో ఉన్నాడు. ఐపీఎల్ 2026లోనూ 16 మ్యాచ్‌లలో 152.50 స్ట్రైక్ రేట్‌తో 427 పరుగులు సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇటీవల వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో తొమ్మిది వన్డేల్లో 228 పరుగులు చేసిన రుతురాజ్‌కు.. లిస్ట్ ఏ క్రికెట్లో మాత్రం మంచి రికార్డు ఉంది. అతడు 99 'లిస్ట్ ఏ' మ్యాచ్‌లలో 58.83 సగటుతో 5,060 పరుగులు సాధించాడు. ఇందులో 20 శతకాలు ఉండటం గమనార్హం. ఐపీఎల్ 2026లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 16 మ్యాచ్‌లలో అతను 337 పరుగులు మాత్రమే చేశాడు.తిలక్ వర్మ కూడా ఈ రేసులో ఉన్నాడు. తన కెరీర్లో ఐదు వన్డేల్లో 68 రన్స్ మాత్రమే చేసిన తిలక్.. దేశవాళీ క్రికెట్ రికార్డులు, ఇటీవల ఫామ్‌తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడు 47 'లిస్ట్ ఏ' మ్యాచ్‌లలో 46.67 సగటుతో మొత్తం 1,867 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2026లో ముంబై
ఇండియన్స్ తరఫున ఆడి, 145.93 స్ట్రైక్ రేట్‌తో 359 పరుగులు చేశాడు.మరోవైపు, టెస్టుల్లో టీమిండియా తరఫున డెబ్యూ చేసిన దేవదత్ పడిక్కల్ .. వన్డేల్లో చోటు కోసం నిరీక్షిస్తున్నాడు. కర్ణాటకకు చెందిన ఈ బ్యాటర్ 42 'లిస్ట్ ఏ' మ్యాచ్‌లలో 82.23 సగటుతో 2,796 పరుగులు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2026లోనూ అతడు తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 16 మ్యాచ్‌లలో 168.73 స్ట్రైక్ రేట్‌తో 464 పరుగులు చేశాడు. మరి వీరిలో ఎవరివైపు సెలక్టర్లు మొగ్గుచూపుతారనేది తేలాల్సి ఉంది.