
Hydraa | హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూముల్లో అది కూడా ఒకటి. హైడ్రా మాటల్లో చెప్పాలంటే, లోతుకుంటలో 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి! ఇది ప్రభుత్వానిదేనని హైడ్రా వాదిస్తున్నది. అది ప్రైవేట్ భూమి అని నిర్మాణ సంస్థ శాంతాశ్రీరామ్ వాదిస్తున్నది. హైకోర్టు డివిజన్ బెంచ్ సైతం అది ప్రైవేట్ భూమి అని తీర్పు చెప్పింది. ఈ తీర్పు 2025 ఆగస్టులో వెలువడింది. అభ్యంతరాలుంటే ఇలాంటి తీర్పులపై 90 రోజుల్లో సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలి. కానీ, ప్రభుత్వం మాత్రం 90 రోజుల్లోపు కాకుండా, 219 రోజులకు అప్పీల్‌కు వెళ్లింది. దీంతో సుప్రీంకోర్టు ఆలస్యంగా వచ్చారనే కారణంతో ప్రభుత్వ పిటిషన్‌ను తిరస్కరించింది. హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు చుక్కెదురైంది. నిర్ణీత సమయా నికి అప్పీల్ చేయలేదని ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే అప్పీల్‌కు వెళ్లాల్సిన రెవెన్యూ శాఖ హైకోర్టు డివిజన్ తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందిస్తుంది. లోతుకుంట శాంతాశ్రీరామ్ భూమి విషయంలో నిర్లక్ష్యం వహించారా? ప్రభుత్వం దృష్టికి విషయం వెళ్లలేదా? సాధారణంగా అందరికీ వచ్చే అనుమానాలు ఇవి. కానీ, ఈ భూ వ్యవహారం మాత్రం అందుకు భిన్నం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కంటే ముందుగానే ఈ భూములపై దృష్టిసారించింది. ఈ మేరకు 2025 మార్చిలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ భూముల వద్దకు పోయి, శాంతాశ్రీరామ్కు చెందిన 40 ఎకరాలతోపాటు మరో రెండు కంపెనీలు తమవిగా చెప్పుకుంటున్న సుమారు 119 ఎకరాలు ప్రభుత్వ భూములేనని, ఆక్రమణలు తొలగించాలని అక్కడికక్కడే మీడియా ముందు ప్రకటించారు. అంతేకాదు, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వచ్చిన తర్వాత కూడా పదేపదే ఆ భూముల్లోకి పోయి సదరు కంపెనీ పనులను నిలిపివేసి, స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో రెండుసార్లు హైకోర్టు ధిక్కరణకు పాల్పడటంతో చివరకు కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసేదాకా పరిస్థితి వచ్చింది. ఈ పరిణామంపై అప్పట్లో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం వెంటనే మీడియా ముందు స్పందించాల్సి వచ్చింది. హైడ్రాతో అది ప్రభుత్వ భూమి అంటూ ఘంటాపథంగా వాదిస్తున్న ప్రభుత్వం.. దాదాపు ఏడాదిపాటు హైడ్రామా సృష్టించే బదులు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువడగానే సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు పోతే సరిపోయేది కదా. ఇప్పుడు హైడ్రా మీడియా ముందు చేస్తున్న వాదనను సుప్రీంకోర్టు ముందు చేసే అవకాశం ఉండేది కదా. ఇంతకీ… రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో ఉన్నట్టా? లేనట్టా?? ఇదంతా చూస్తుంటే… ఆ భూముల్లో హైడ్రా వీరంగం సృష్టించిన సమయంలో వచ్చిన, ఇప్పుడు 22ఏ సమస్య సందర్భంగా వస్తున్న ‘30% కమీషన్’ ఆరోపణలకూ, దీనికీ ఏమైనా లింకులు ఉన్నాయా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలోని సర్వే నంబర్ 1,2లో ఉన్న 40 ఎకరాల భూమి ప్రైవేట్దేనంటూ కోర్టులు తీర్పులిచ్చిన నేపథ్యంలో హైడ్రా మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని వాదిస్తున్నది. ఈ భూమికి సంబంధించి 2013 నుంచి టైటిల్ వివాదం కొనసాగుతున్నది. భూమి ప్రభుత్వానిదేనంటూ తిరుమలగిరి తహసీల్దార్ శాంతాశ్రీరామ్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఆర్డీవో, ఎమ్మార్వోలు కూడా అది ప్రభుత్వానిదేనని చెప్పడంతో ఆ నిర్మాణ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. 2016 నుంచి వివాదం కొనసాగి 2021లో సింగిల్‌బెంచ్ ఇది ప్రైవేట్ భూమేనంటూ తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లగా 2022లో వారు కూడా ఈ అప్పీల్‌ను డిస్మిస్ చేశారు. ఇదే సమయంలో టైటిల్ డిక్లరేషన్ కోసం సిటీ సివిల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేశారు. లోతుకుంట టైటిల్ డిక్లరేషన్ విషయంలో సిటీ సివిల్ కోర్టు తీర్పుపై ప్రభుత్వ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పు వచ్చిన ఎనిమిది నెలలకు అంటే, ఈ సంవత్సరం జూన్ 4న హైడ్రా సిబ్బంది లోతుకుంటలోని భూమిపైకి వెళ్లి రణరంగాన్ని సృష్టించారు. ఆరు రోజులపాటు అదే స్థలంలో వాహనాలు, మందీమార్బలంతో హంగామా చేస్తూ శాంతాశ్రీరామ్ నిర్మాణ సంస్థ పనులు జరుగకుండా హైడ్రా అడ్డుకున్నది. దీంతో లోతుకుంట విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును హైడ్రా ఉల్లంఘిస్తున్నదంటూ ఆ నిర్మాణ సంస్థ కోర్టు ధిక్కరణ కేసు వేసింది. దీంతో హైడ్రా సూపర్‌కాప్ కాదని, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించవద్దని, ఆ భూమిలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ నుంచి రికార్డెడ్ అండర్‌టేకింగ్ తీసుకొన్నది. ఇది జరిగిన నెల తర్వాత జూలై 18న హైడ్రా తిరిగి అదే భూమిలోకి దౌర్జన్యంగా మందీమార్బలంతో చొరబడి నిర్మాణ పనులను అడ్డుకోవడంతోపాటు అక్కడ ఉన్న సీసీకెమెరాలను ధ్వంసం చేసి కాంపౌండ్‌వాల్‌ను కూలగొట్టి, టిన్షీట్స్ను నేలమట్టం చేసింది. జీఎల్ఆర్ 243, 255లో సుమారు రూ.పదివేల కోట్ల విలువైన భూమిని కాపాడినట్టు రంగనాథ్ ప్రకటించారు. శాంతాశ్రీరామ్ సంస్థ చెప్తున్న భూమికి, తాము కాపాడిన భూమికి సంబంధం లేదని, అది ప్రభుత్వ భూమికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నదని, తాము ప్రభుత్వ భూమినే కాపాడినట్టు రంగనాథ్ చెప్పడం వివాదాస్పదమైంది. ఒకవైపు, కోర్టులో అండర్‌టేకింగ్ ఇచ్చి, ఆ తర్వాత మళ్లీ అదే స్థలానికి వచ్చి ఫెన్సింగ్ వేసి అది ప్రభుత్వ స్థలమేనంటూ చెప్పడంపై శాంతాశ్రీరామ్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. హైడ్రా కోర్టు ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. ప్రభుత్వం సహా హైడ్రా ఈ భూమి విషయంలో వరుసగా కోర్టు ఉల్లంఘనలకు పాల్పడిందని, ఒకసారి అండర్‌టేకింగ్ ఇచ్చిన తర్వాత ఎలా మళ్లీ కోర్టు తీర్పును ఉల్లంఘిస్తారంటూ ప్రశ్నించడమే కాకుండా ఆర్మీని పెట్టి హైడ్రా సిబ్బందిని బ్యారక్‌లో వేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్‌ను స్వయంగా కోర్టుకు పిలిచి విచారించి ఇలాంటి చర్యలు మంచివి కాదని చెప్పడమే కాకుండా, రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌గా తొలగించాలంటూ చీఫ్ సెక్రటరీని కోరడంతో ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే ఒకవైపు కోర్టులో ఉల్లంఘనపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఇది ప్రైవేట్ భూమి అంటూ హైడ్రా కమిషనర్ ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్‌మీడియాలో పోస్టులో పెడుతూ హడావుడి చేశారు. ఇదే సమయంలో కమిషనర్‌ను తొలగించాలని తీర్పులో న్యాయమూర్తి చీఫ్ సెక్రటరీకి సూచించడంతో తన పోస్టుకు ఎసరు వస్తుందని భావించిన కమిషనర్ ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లారు తప్ప భూమి విషయంలో అప్పీల్‌కు వెళ్లలేదు. 90 రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన ప్రభుత్వం, హైడ్రా అలా చేయకుండా చివరిలో నాలుక కరుచుకొని సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ చుక్కెదురైంది. ఈ తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా అధికారిక . సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘లోతుకుంట భూముల వివాదానికి సంబంధించి దాఖలైన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో కొట్టేసింది. అప్పీల్ దాఖలు చేయాల్సిన సాధారణ గడువు 90 రోజులు కాగా, ఈ కేసులో అప్పీల్ దాఖలు చేయడానికి 219 రోజులు ఆలస్యమైనట్టు తెలుస్తున్నది. దీంతో పిటిషన్ కాలపరిమితి దాటిన కారణంతోనే సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం, న్యాయనిపుణులు, సంబంధిత అధికారులు, ఇతర స్టేక్హోల్డర్లతో చర్చలు జరుపుతాం. సర్వే జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. జీఎల్ఆర్ 243లో పేర్కొన్న 119 ఎకరాల విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించి, హద్దులను భౌతికంగా నిర్దారించాల్సిన అవసరం ఉన్నది. సక్రమమైన సర్వే ద్వారా గ్రౌండ్‌పై మార్కింగ్ చేసిన తర్వాతే భూమిపై వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుంది. అయితే, ఈ కోర్టు వివాదం రెవెన్యూ శాఖ లేదా హైదరాబాద్ కలెక్టర్‌కూ, శాంతాశ్రీరామ్కు మధ్య ఉన్నదని, తమకు ఈ వివాదంతో సంబంధం లేదని, తాము ఈ కేసులో పార్టీ కాదని హైడ్రా కమిషనర్ చెప్పారు. తాము కేవలం ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో జూలైలో ఫెన్సింగ్ వేశామని పేర్కొన్నారు. 2008లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమికి లేఅవుట్ మంజూరు చేసింది. ఆ తర్వాత 2013 నుంచి రెవెన్యూ అధికారులకు, నిర్మాణ సంస్థకు మధ్య ప్రభుత్వ భూమి అనే విషయంలో కోర్టు వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో 2021 మార్చి 8న ఈ భూమిని ప్రైవేట్ పట్టా భూమిగా ప్రకటిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. 02.07.2021: ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. నిర్మాణసంస్థకు స్వాధీనం చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును డివిజన్ బెంచ్ నాలుగు వారాల పాటు నిలిపివేసింది. విచారణ తర్వాత రిట్ అప్పీల్‌ను కొట్టేసిన డివిజన్ బెంచ్ హక్కు స్వాధీనం కోసం సూట్ దాఖలు చేసుకోవచ్చని చెప్పింది. 05.08.2021: తనకు ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించలేదని మొదటి కోర్టు ఉల్లంఘన కింద నిర్మాణ సంస్థ ప్రభుత్వంపై హైకోర్టును ఆశ్రయించింది. 06.08.2021: ప్రభుత్వం ఆ ఖర్చును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించింది.