
భారతీయ స్టాక్ మార్కెట్లో తీవ్రమైన అస్థిరత, అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం అనూహ్యమైన ఒరిపిడిని తట్టుకొని నిలబడ్డాయి. సాధారణంగా మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు చిన్న తరహా కంపెనీల షేర్లు కుప్పకూలుతాయని అందరూ భావిస్తారు.
కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. గత మే నెలలో లార్జ్ క్యాప్ సూచీ అయిన నిఫ్టీ 50 దాదాపు 2.5 శాతం మేర నష్టపోగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ మాత్రం కేవలం 0.15 శాతం స్వల్ప తగ్గుదలతో దాదాపు స్థిరంగా ముగిసింది. పెద్ద పెద్ద కంపెనీల షేర్లే కుదేలవుతున్న తరుణంలో, ఈ చిన్న కంపెనీలు మార్కెట్ ఒడిదుడుకులను ఎలా తట్టుకోగలిగాయనే ప్రశ్న ఇప్పుడు ప్రతి పెట్టుబడిదారుడి మదిని తొలిచేస్తోంది.
ఈ అసాధారణ మార్పుకు గల కారణాలను బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (AMC) అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా స్మాల్ క్యాప్ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం లేదా నిర్మాణాత్మక మార్పు చోటుచేసుకుంది.
ఈ కంపెనీలు ఇప్పుడు భారీగా అప్పులు చేసి వ్యాపారాలను విస్తరించడం లేదు. వాటి సొంత నగదు ప్రవాహాలు (internal cash flows), అంతర్గత లాభాల ద్వారానే భవిష్యత్తు అవసరాలకు నిధులను సమకూర్చుకుంటున్నాయి. ఫలితంగా వీటి బ్యాలెన్స్ షీట్లు మునుపటి కంటే ఎంతో బలంగా మారాయి.
గణాంకాలను పరిశీలిస్తే, ఆర్థిక సంవత్సరం 2019 నుండి 2022 మధ్య కాలంలో స్మాల్ క్యాప్ విభాగంలో మొత్తం మూలధన వ్యయం (capital expenditure) రూ. 2.2 లక్షల కోట్లుగా ఉంటే, అది ఆర్థిక సంవత్సరం 2023 నుండి 2026 నాటికి ఏకంగా రూ. 3.4 లక్షల కోట్లకు పెరిగింది.
ఇదే సమయంలో కంపెనీల నెట్ డెట్-టు-ఈక్విటీ రేషియో (నికర అప్పు-ఈక్విటీ నిష్పత్తి) 2019 లో ఉన్న 0.52x స్థాయి నుండి 2026 నాటికి దాదాపు సున్నా స్థాయికి పడిపోవడం విశేషం.
.