కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి కాపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యక్తిపై బావమరిది పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణమైన ఘటన పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనలో బాధితుడితో పాటు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన వదిన ప్రాణాలు కోల్పోయారు. జూన్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డుకాగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అమృత్సర్ జిల్లా లొపొకే గ్రామానికి చెందిన లవ్‌ప్రీత్ సింగ్ తీవ్ర గాయాలతో చనిపోయాడని, అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన భార్య సోదరి గుర్జిత్ కౌర్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ కొద్ది రోజుల తర్వాత మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. బావపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత నిందితుడు సాజన్ సింగ్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయని, అక్కడున్నవారి అతడ్ని కాపాడారని చెప్పారు. తరన్ తరన్ సీనియర్ ఎస్పీ సురేంద్ర లంబా ఈ ఘటనను శనివారం ధ్రువీకరించారు. దాడి జరిగిన వెంటనే లవ్‌ప్రీత్ మరణించగా, తీవ్ర గాయాలతో గుర్జిత్ కౌర్ కొన్ని రోజుల ముందే మరణించిందని ఆయన పేర్కొన్నారు.పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడితో లవ్‌ప్రీత్ తీవ్ర వాగ్వాదానికి, ఘర్షణకు దిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ఒక వ్యక్తి లవ్‌ప్రీత్‌పై పెట్రోల్ అని భావిస్తున్న మండే ద్రవాన్ని పోసి, లైటర్‌తో నిప్పంటించినట్లు ఫుటేజీలో ఉంది. ఫుటేజీలో మంటలు వేగంగా వ్యాపిస్తుండగా, మంటల్లో చిక్కుకున్న లవ్‌ప్రీత్, గుర్జిత్ కౌర్ ఇద్దరూ భయంతో పరుగులు తీయడం కనిపిస్తోంది.నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్పి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మృతుడి భార్య సందీప్ కౌర్‌ను కూడా అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. జూన్ 13న తనతో పాటు తిరిగి రావాలని ఒప్పించేందుకు లవ్‌ప్రీత్, సంఘా గ్రామంలోని తన భార్య పుట్టింటికి వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిద్దరికీ పెళ్లై సుమారు తొమ్మిది నెలలు అయిందని, కొద్దికాలానికే ఒక వివాదం కారణంగా సందీప్ కౌర్ తన పుట్టింటికి తిరిగి వెళ్లి అప్పటినుంచి అక్కడే ఉంటోందని అన్నారు.