
ఇటీవలికాలంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. అనుమానం, అక్రమ సంబంధాలు ఇలా అనేక కారణాలతో భర్తలు భార్యలపై దాడులు చేయడం, భార్యలు భర్తలపై దాడులు చేయడం లాంటి ఘటనలు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. భర్తను చంపి బాత్ రూమ్ లోనే పాతిపెట్టింది ఓ మహిళ. ఈ మేరకు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు బాత్ రూమ్ టైల్స్ ను తొలగించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆ మహిళకు ఇంకా ఎవరైనా హెల్ప్ చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర శర్మ, తన భార్య రూబీతో ఆగ్రాలోని రేణుకా ధామ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే మే లో తన భర్త అదృశ్యం అయ్యాడంటూ బంధువులు, ఇరుగుపొరుగు వారిని నమ్మించింది రూబీ. అయితే సురేంద్ర సోదరుడికి రూబీపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా రూబీ అసలు విషయం బయట పెట్టింది.
తన భర్త పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని.. ఏం చేయాలో తెలియక బాత్ రూమ్ లో తాను పూడ్చిపెట్టినట్లు పేర్కొంది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాత్ రూమ్ లోకి వెళ్లి టైల్స్ తీశారు. రెండు అడుగుల మేర తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే ఈ ఘటనలో హత్య కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో రూబీకి ఎవరైనా సాయం చేశారా..? అనే కోణంలోనూ దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోస్టుమార్టం నివేదికలో వచ్చిన ఆధారాల ప్రకారం రూబీపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.