
– గుంతల రోడ్డుతో వాహనదారుల ఇబ్బందిని తొలగించాలి – సీపీఎం ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో బూర్గంపహాడ్, జూలై 04 : మణుగూరు వైపు వెళ్లే సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించాలని, గుంతల రహదారితో...
– గుంతల రోడ్డుతో వాహనదారుల ఇబ్బందిని తొలగించాలి – సీపీఎం ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో
బూర్గంపహాడ్, జూలై 04 : మణుగూరు వైపు వెళ్లే సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించాలని, గుంతల రహదారితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిపై నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ రహదారిపై ఆర్టీసీ బస్సులతో పాటు లారీలు, ట్రాక్టర్లు ఇలా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని ప్రతిసారీ రహదారిపై గోతులు పడి వర్షాకాలం వస్తే చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయని, పలు ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.
ఇటీవల కాలంలో ఈ రహదారి పరిస్థితులపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపామన్నారు. తక్షణమే సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించి వాహనదారుల ఇబ్బందులు పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు సంబంధితశాఖ అధికారులను కోరారు. నెలాఖరు కల్లా రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్కే పాషా, అప్పారావు, నర్సింహారావు, బత్తుల గోపాలరావు, బోళ్ల ధర్మారావు, కన్నయ్య, సురేష్, శ్రీను పాల్గొన్నారు.