
ఐపీఎల్లో అభిమానులు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Debut) మెరుపులు చూశారు. ఇండియా-ఎ తరఫున అతడి విధ్వంసాన్ని చూశారు. ఇక తర్వాతి అడుగు భారత జట్టే. ఆ మెట్టు కూడా ఎక్కేశాడు ఈ పిల్లాడు.
కానీ, తుది జట్టులో స్థానం మాత్రం దక్కలేదు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో అతడికి అవకాశం రాలేదు. పోనీ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో (Team India in England) తొలి మ్యాచ్‌లో చిన్నోడు పక్కా ఉంటాడు అనుకుంటే మళ్లీ రిజర్వ్ బెంచ్‌లోనే కనిపించాడు. దీంతో అభిమానులు చాలా నిరాశ పడ్డారు. ఈ కుర్రాడు ఉంటేనా... దుమ్మురేపేవాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక సూర్యవంశీపై మీమ్స్‌కు లెక్కేలేదు. ‘అన్నా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నా’ అంటూ అతడిపై మీమ్స్ వస్తూనే ఉన్నాయి. జోకులు పేలుతూనే ఉన్నాయి.
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 (India vs England) వర్షం కారణంగా రద్దైంది. ఇవాళ ఇంగ్లిష్ జట్టుతో రెండో టీ20కి. ఈ మ్యాచ్‌లోనైనా సూర్యవంశీ ఉంటాడా అనేది చూడాలి. నిజానికి కొత్త కుర్రాళ్లను జట్టులోకి తీసుకుంటే కచ్చితంగా ఒకటి రెండు సిరీస్‌లు తిప్పి తర్వాత ఛాన్స్ ఇవ్వడం భారత జట్టులో ఆనవాయితీ. కొందరినైతే రెండు సిరీస్‌లు వెంట తిప్పుకుని తర్వాత జట్టులోంచి తీసేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కేసు వేరు. 15 ఏళ్ల కుర్రాడు ఒక సంచలనం. భారత క్రికెట్లో అతడో అద్భుతం. అందుకే అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ కుర్రాడి బ్యాటింగ్ చూద్దామా అని ఆత్రుతపడుతున్నారు.
జట్టు వాతావరణానికి అలవాటుపడడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం, సీనియర్లతో కలుపుగోలుగా మెలగడం ఇవన్నీ టీమ్ఇండియా(Team India)కు ఎంపికైన ప్రతి ఆటగాడికి అత్యవసరం. సూర్యవంశీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందులోనూ టీనేజర్. అందరికంటే చిన్నోడు. అనుభవం చాలా తక్కువ. ఐపీఎల్లో మిగిలిన ప్లేయర్లతో ఆడినా.. అంతర్జాతీయ స్థాయిలో సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమిచడం భిన్నంగా ఉంటుంది.
అందుకే, అతడికి ఆ వాతావరణం అలవాటు కావడానికే భారత్ వెంటనే బరిలోకి దింపట్లేదేమో! ముఖ్యంగా విదేశీ వాతావరణం, పిచ్‌లు సూర్యవంశీ(Vaibhav)కి కొత్త. భారత్-ఎ, అండర్-19 లాంటి జట్ల తరఫున విదేశాల్లో ఆడినా అది వేరు.. ఇది వేరు. సీనియర్ జట్టు తరఫున ఆడే వాతావరణం వేరుగా ఉంటుంది. అంచనాలు భారీగా ఉంటాయి. తొందరపడి అతడిని బరిలోకి దించితే ఒత్తిడికి లోనై విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. తన శైలిలో ఆడే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. అందుకే సూర్యవంశీ (Sooryavanshi)కి కుదురుకునే టైమ్ ఇవ్వాలనేది జట్టు ఆలోచన కావొచ్చు. అందుకే ట్రైనింగ్ సెషన్లో మాత్రం సూర్యవంశీతో గట్టిగానే ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సీనియర్లతో కలిసి మాట్లాడేలా అతడిని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, అభిషేక్‌శర్మ అయితే వైభవ్‌ను వదలట్లేదు. ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. ఇప్పటికే మూడు టీ20లు (ఐర్లాండ్ సిరీస్‌తో కలిపి) రిజర్వ్ బెంచ్‌పై ఉన్న సూర్యవంశీకి ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో అవకాశం ఇస్తారేమో చూడాలి. ఒకవేళ అదే జరిగే అభిమానులకు ఫుల్ ఖుషీనే. అదే జరిగితే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పిన్న వయస్కుడిగా సూర్యవంశీ.. సచిన్ తెందుల్కర్ (16 ఏళ్లు) రికార్డు బద్దలు కొట్టి చరిత్రలో నిలిచిపోతాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.