
వరుసగా విఫలమైన సంజు శాంసన్‌పై వేటు వేయాలనే డిమాండ్లు.. తిలక్ వర్మ జట్టు కోసం కాకుండా స్వార్థపూరితంగా ఆడాడంటూ వ్యాఖ్యలు.. వైభవ్‌ను ఇంకా తీసుకోలేదంటూ మేనేజ్మెంట్పై విమర్శలు..
ఇవీ గత మూడు టీ20ల అనంతరం టీమ్ఇండియాపై చర్చకు దారితీసిన అంశాలు..
ఐర్లాండ్‌తో వరుసగా రెండు టీ20ల్లో భారత్ ఓడిపోయింది. అనంతరం ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకట్టుకోగా.. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మరోసారి విఫలమయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు ఫామ్ అందుకోవడం భారత్‌కు కలిసొచ్చే అంశమే. ఐర్లాండ్‌పై అతడు ఏమాత్రం ప్రభావం చూపించలేదు. కీలక సమయంలో వికెట్‌ను కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నమోదు చేయడం గమనార్హం.
టీ20 ప్రపంచ కప్ నెగ్గి.. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడి వచ్చిన భారత ప్లేయర్లకు భంగపాటు ఎదురైంది. మరీ ముఖ్యంగా ఓపెనర్ సంజు శాంసన్ అత్యంత దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. మూడు మ్యాచుల్లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమైన అతడు.. టెక్నిక్‌ను మార్చుకోలేక ఇబ్బందిపడ్డాడు. దీంతో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకొనేందుకు ఇదే సరైన తరుణమని పలువురి సూచన. మేనేజ్మెంట్ మాత్రం సీనియర్లకు మద్దతుగా నిలుస్తామని చెబుతోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో రెండో టీ20లోనూ వైభవ్‌కు అవకాశం దక్కడం కష్టమేనని అనిపిస్తోంది.
ఐర్లాండ్‌పై రెండు మ్యాచుల్లోనూ తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, అతడి ఆటతీరే విమర్శలకు దారితీసింది. చాలా నెమ్మదిగా ఆడాడని.. ఛేదించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడానికి కారణమదేనని పలువురు వ్యాఖ్యానించారు. మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ అయితే ఒక అడుగు ముందుకేసి.. తిలక్ హీరో కావాలనే మ్యాచ్‌లో చాలా స్లోగా ఆడాడని విమర్శించాడు. ఇక ఇంగ్లాండ్‌తోనూ తిలక్ వర్మ పెద్దగా రాణించలేదు. దీంతో అతడి ఆటతీరుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. తన కోసం కాకుండా.. జట్టే ప్రధానమని నిరూపించుకోవాల్సిన బాధ్యత తిలక్‌పై ఉంది. ఫినిషర్‌గా మ్యాచ్‌ను చివరి వరకూ ఉండి ముగించాల్సిన అవసరం ఉంది.
ఇంగ్లాండ్ బ్యాటర్లను వారి సొంత గడ్డపై అడ్డుకోవాలంటే భారత బౌలింగ్ విభాగం కష్టపడాల్సిందే. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్లు ఫిల్ సాల్ట్ - జోస్ బట్లర్లతో అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ ఉంది. తొలి టీ20లో టీమ్ఇండియా ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు, ఒక స్పిన్ ఆల్‌రౌండర్, ఇద్దరుపేసర్లతో బరిలోకి దిగింది. శివమ్ దూబే రూపంలో ఎలానూ మీడియం ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉన్నాడు. యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఐర్లాండ్‌పై మంచి ప్రదర్శనే ఇచ్చాడు. అతడికి ఇంగ్లాండ్‌పై ఛాన్స్ ఇస్తే బాగుంటుందనేది కొందరి సూచన. మరి తుది జట్టు విషయంలో మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.