
బెంగళూరులో ఇల్లు వెతకడం ఎంత కష్టమో చెప్పే మరో ఘటన ఇది. ఈ నగరంలో అద్దెలు, సెక్యూరిటీ డిపాజిట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఇంటి ఓనర్ల కఠిన నిబంధనలు.
దీంతో సరైన ఇల్లు దొరక్క ఐటీ ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నాడు. నగరంలో 1BHK ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే కంపెనీ ఆఫీసుకు రమ్మని పిలిచింది. దీంతో అద్దె కోసం వెతకగా ఆ సింగిల్ బెడ్ రూమ్ కు ఏకంగా ₹1.5 లక్షల డిపాజిట్ అడిగాడట ఇంటి యజమాని. దీంతో షాక్ అయిన టెకీ ఆఫీసుకు రావడం కంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశం (WFH) ఇవ్వమని కంపెనీని కోరాడు. కంపెనీ అందుకు ఒప్పుకోలేదు. ఎలాగైనా బెంగళూరు ఆఫీసుకు రావాల్సిందేనని చెప్పింది.
ఉద్యోగి ఎన్నిసార్లు తన పరిస్థితి చెప్పినా అభ్యర్థించినా కంపెనీ అంగీకరించలేదు. 'WFH సాధ్యం కాదు, ఆఫీసులో చేరండి లేదా ఉద్యోగం మానేయండి' అని రెండు ముక్కల్లో తేల్చి చెప్పింది. దీంతో ఆ ఉద్యోగి చివరికి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతను సోషల్ మీడియాలో తన అనుభవాన్ని రాశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు, కొంతమంది ఇంటి ఓనర్లు అద్దెకు ఉండేవారి లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ చెక్ చేయడం, ఉద్యోగ వివరాలు అడగడం, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు సాధారణమైపోయిందని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.