
ప్లేఆఫ్స్‌లో హైదరాబాద్ వరంగల్‌పై ఘనవిజయం అభిరథ్ మెరుపు శతకం ఈనాడు - హైదరాబాద్ టీజీ20లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌కు ఎదురే లేదు.. కెప్టెన్ అభిరథ్ రెడ్డికి తిరుగులేదు.
ఎదురైన ప్రతి ప్రత్యర్థినీ ఓడిస్తూ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ ఛాంపియన్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ అభిరథ్ రెడ్డి టోర్నీలో తొలి శతకాన్ని అందుకున్నాడు. అజయ్‌దేవ్ గౌడ్ మరోసారి బంతితో అదరగొట్టిన వేళ వరంగల్ వారియర్స్‌ను హైదరాబాద్ చిత్తు చేసింది.
అభి ఈసారి వదల్లేదు..: టీజీ20లో ప్రతి మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో చెలరేగుతూ జట్టు విజయాల్లో కీలకమవుతున్న అభిరథ్.. ఈసారి చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించడమే కాదు.. తొలిసారి సెంచరీ కూడా పూర్తి చేశాడు. రంగారెడ్డిపై 99 పరుగులకు ఔటైన అతను.. ఈ మ్యాచ్‌లో పట్టు వదలకుండా సెంచరీ పూర్తి చేశాడు. ముదస్సర్ వేసిన రెండో ఓవర్లో అతడు 3 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపించి వరంగల్ బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. అయితే అవతలి ఎండ్‌లో వెంటవెంటనే మూడు వికెట్లు పడడంతో హైదరాబాద్ ఒత్తిడిలో పడింది. సాయివికాస్ (10) నిరాశపరచగా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అజయ్ దేవ్ (0) రనౌటయ్యాడు. వెంటనే అన్విత్ రెడ్డి (4) కూడా పెవిలియన్ చేరిపోవడంతో పవర్ ప్లే ఆఖరికి ఈ ఛాంపియన్స్ 56/3తో నిలిచింది. కానీ అభి తగ్గలేదు. ఫామ్‌లో ఉన్న గణేశ్ గడుగుతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. మొదట వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చిన గణేశ్.. కుదురుకున్నాక భారీ షాట్లకు దిగాడు. సిక్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న గణేశ్.. మరుసటి బంతికే ఔటయ్యాడు. 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అభి.. తర్వాత మరింత ధాటిగా ఆడి, చూస్తుండగానే 90లోకి వెళ్లిపోయాడు. విజయానికి 6 పరుగులు కావాల్సిన స్థితిలో అతడు వరుసగా 4, 6 బాది శతకాన్నందుకున్నాడు. 13 ఓవర్లకు 134/4తో ఉన్న హైదరాబాద్.. అభి రెచ్చిపోవడంతో మరో 15 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది.
ఆరంభ మెరుపులే..: మొదట వరంగల్ వారియర్స్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. అమన్, హర్షిత్ చెలరేగడంతో దేవ్ మెహతా వేసిన ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో 21 పరుగులొచ్చాయి. 5 ఓవర్లకు 64/0తో వారియర్స్‌కు బలమైన పునాది పడింది. అయితే పవర్ ప్లే ఆఖరి ఓవర్లో అజయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతికే హర్షిత్‌ను ఔట్ చేసిన అతను.. అయిదో బంతికి అమన్నూ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వరంగల్ బ్యాటర్లు పరుగుల కోసం చెమటోడ్చారు. పవర్ ప్లే పూర్తయ్యాక తొలి బౌండరీ సాధించడానికి వారియర్స్ బ్యాటర్లకు 30 బంతులు పట్టింది. ఈ మధ్యలోనే షణ్ముఖ.. అభిషేక్ (4)ను ఔట్ చేశాడు. సంయమనంతో ఆడిన రిషికేత్.. ధీరజ్ (18)తో నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. ఆఖర్లో శౌనక్ మెరుపు షాట్లు ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
నల్గొండపై ఖమ్మం విజయం: మరో మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ 34 పరుగుల తేడాతో నల్గొండ నైట్స్‌పై నెగ్గింది. మొదట హిమతేజ (80 నాటౌట్), సాయికృష్ణా రెడ్డి (56 నాటౌట్) రెచ్చిపోవడంతో ఏసెస్ 2 వికెట్లే కోల్పోయి 211 పరుగులు చేసింది. హిమతేజ, సాయికృష్ణ అభేద్యమైన మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. దివేశ్, అనికేత్ చెరో వికెట్ తీశారు. ఛేదనలో వేద్ రెడ్డి (3/26), వాఫి కాచి (3/35) ధాటికి తడబడిన నల్గొండ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 177 పరుగులే చేసింది. గౌరవ్ రెడ్డి (54) అర్ధశతకం చేశాడు. ఆఖర్లో హర్షవర్ధన్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.