
China apps | దిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఇ-రిక్షాలను షట్‌డౌన్ చేస్తున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
మార్గమధ్యంలో ఆటోల నిలిపివేతకు కారణమవుతున్న రెండు చైనా యాప్‌లను గుర్తించి చర్యలు చేపట్టింది. యాప్ స్టోర్ నుంచి వాటిని తొలగించినట్లు ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్ తెలిపారు. ఇ-రిక్షాలను నడిరోడ్డుపై షట్‌డౌన్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ రెండు యాప్స్‌ను తొలగించినట్లు తెలిపారు.
దేశ రాజధాని దిల్లీలో ఇ-రిక్షా డ్రైవర్లను, డీలర్లను ఈ యాప్‌లు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (BMS)లోని వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను తెలుసుకోవడానికి BAT-BMS అనే చైనీస్ మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తారు. దీనికి ఎలాంటి పాస్వర్డ్, సెక్యూరిటీ అథంటికేషన్ లేకపోవడం వల్ల బ్లూటూత్ రేంజ్లో ఉన్న వారు ఎవరైనా సరే ఆపరేట్ చేయొచ్చు. కేవలం ఒక్క ట్యాప్‌తో వాహనానికి పవర్ సప్లయ్ కాకుండా నిలిపివేయవచ్చు.
దీంతో రోడ్డుపై వెళ్తున్న ఈ-రిక్షాలను యాప్ ద్వారా రిమోట్‌గా ఆఫ్ చేస్తూ డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. Epoch Li-ion అనే మరో బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్‌లో కూడా ఇలాంటి లోపమే ఉన్నట్లు తేలింది. ఈ తరహా యాప్స్‌ను నిషేధించాలంటూ భాజపా నేత తజిందర్ బగ్గా ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు యాప్స్‌ను తొలగించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఏటా వైభవంగా సాగే అమర్నాథ్ యాత్ర శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది.