
ఇంటర్నెట్ డెస్క్: క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని అతడి సోదరి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.
వరల్డ్ కప్ ముగిసేలోపే నిర్ణయం ప్రకటిస్తాడని అందులో ఆమె పేర్కొంది. రౌండ్ 32లో క్రొయేషియాతో మ్యాచ్‌కు ముందు ఆమె ఈ పోస్టు చేయడంతో ఏమవుతుందోనని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. క్రొయేషియాపై పోర్చుగల్ విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. మ్యాచ్ అనంతరం రొనాల్డో మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్పై వస్తోన్న ప్రచారాన్ని ఖండించాడు. వరల్డ్ కప్ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు.
‘‘నేనెప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. ఏదైనా సరే టోర్నీ (FIFA World Cup 2026) ముగిసిన తర్వాతే డిసైడ్ చేస్తా. క్రొయేషియా ఆటగాడు లూకాతో కలిసి నేను చాలా ఏళ్లుగా ఆడా. మా వయసు కూడా దాదాపు ఒకటే. అతడు దిగ్గజ ఆటగాడు. ఇప్పటికీ ఉత్సాహంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ విషయం అతడికి చాలా సార్లు చెప్పా. అతడిని ఇలా చూడటం చాలా సంతోషంగా అనిపించింది’’ అని క్రిస్టియానో తెలిపాడు. క్రొయేషియాపై గోల్ కొట్టిన రొనాల్డో (15).. ప్రపంచ కప్‌ల్లో అత్యధిక గోల్స్ చేసిన నాలుగో ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. లియోనెల్ మెస్సి (19), ఎంబాపె (18) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్‌తో పోర్చుగల్ తలపడనుంది.
క్రొయేషియాతో (POR vs CRO) మ్యాచ్‌లో తమకు వీడియో అసిస్టెంట్ రిఫరీ నిర్ణయాలు అనుకూలంగా రావడం అదృష్టంగా భావిస్తున్నామని పోర్చుగల్ కోచ్ రాబెర్టో మార్టినెజ్ వ్యాఖ్యానించాడు. ‘‘వీఏఆర్ నిర్ణయాల్లో పొరపాటే లేదు. అదృష్టవశాత్తూ మాకు అనుకూలంగా వచ్చాయి. మాకు పెనాల్టీ కిక్ రావడంలో ఎలాంటి తప్పుడు నిర్ణయం లేదు. క్రొయేషియా కోచ్ శ్రమను నేను అర్థం చేసుకోగలను. కానీ, ఈ మ్యాచ్‌లో ఒక్కరే విజేతగా నిలుస్తారనేది కాదనలేని వాస్తవం’’ అని మార్టినెజ్ తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.