
పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారాయని భావిస్తున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచం ఉలిక్కిపడే ప్రకటన చేశారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని..
Jul 1 2026 9:37 AM | Updated on Jul 1 2026 10:07 AM
పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారాయని భావిస్తున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచం ఉలిక్కిపడే ప్రకటన చేశారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని.. అవసరమైతే మరోసారి ఇరాన్‌పై దాడులు చేసి తీరతామని అంటున్నారాయన. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక మరోసారి ఉద్రిక్తతలను పెంచేలా కనిపిస్తోంది.
ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్–14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఇప్పటివరకు విజయవంతమైందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నుంచి వస్తున్న అణుబాంబు ముప్పు నుంచి మేము మా దేశాన్ని కాపాడుకున్నాం. అవసరమైతే ఇంకోసారి కూడా దాడి చేస్తాం’’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్న నెతన్యాహూ.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మరోసారి తేల్చిచెప్పారు.
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్చల్లో ఆర్థిక ఆంక్షల సడలింపు, హర్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై పర్యవేక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
ప్రతిపాదిత అవగాహన ప్రకారం.. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై సాంకేతిక స్థాయి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
'అమెరికా ఒప్పందానికి మేము కట్టుబడి ఉండం' అయితే అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా.. అది తమ భద్రతకు భంగం కలిగిస్తే ఇజ్రాయెల్ దానికి కట్టుబడి ఉండబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక లేదంటే అణు సామర్థ్యం కొనసాగితే అవసరమైన చర్యలు స్వతంత్రంగా తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రంప్ సూచన.. 'జాగ్రత్తగా ఉండండి' ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్‌ను సంయమనం పాటించాలని కోరుతూ వస్తున్నారు. మరోసారి భారీ స్థాయిలో దాడులు చేస్తే ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరిగా మారే ప్రమాదం ఉందని నెతన్యాహుకు సూచించినట్లు వెల్లడించారు. "బీబీ.. కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకపోతే త్వరలోనే మీరు ఒంటరిగా మిగిలిపోతారు" అని తాను హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దౌత్య చర్చలు విజయవంతం కావాలంటే కొత్త సైనిక చర్యలకు దూరంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
లెబనాన్‌లోనూ వెనక్కి తగ్గేది లే ఇరాన్‌పై హెచ్చరికలతో పాటు లెబనాన్ విషయంలోనూ నెతన్యాహు కఠిన వైఖరినే ప్రదర్శించారు. దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ నియంత్రణ ప్రాంతాలను సందర్శించిన ఆయన.. హెజ్బొల్లాముప్పు పూర్తిగా తొలగే వరకు అక్కడి నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని ప్రకటించారు. ‘‘హెజ్బొల్లా ఆయుధాలతో అక్కడే ఉన్నంత కాలం.. మా బలగాలు కూడా అక్కడే ఉంటాయి. మా ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. ఓ స్పష్టత అంటూ లేకుండా పోయింది.
మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదమా? ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ అవసరమైతే మరోసారి సైనిక చర్యలకు సిద్ధమని స్పష్టం చేయడం మధ్యప్రాచ్యంలో కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు ఫలిస్తాయా? లేదంటే మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)
గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)
గుడ్ న్యూస్.. కదులుతున్న నైరుతి రుతుపవనాలు
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు సజీవదహనం
ఈ సారి అరే గిరే అని సౌండ్ చేస్తే రౌండ్ పక్కా...
మేకప్ మంత్రి అని అన్నది మీ టీడీపీనే.. అనితను చెడుగుడు ఆడుకున్న శ్యామల, నాగమల్లీశ్వరి