
మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'ఇరుముడి'. భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ అంశాల మేళవింపుతో వచ్చిన ఈ సినిమాపై తొలి నుంచే పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజను సరికొత్త ఆధ్యాత్మిక, కుటుంబ నేపథ్యంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే విదేశీ ప్రీమియర్లను పూర్తి చేసుకుని పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది.ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. మద్యం వ్యసనానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకునే ఒక సాధారణ గ్రామీణ తండ్రి చుట్టూ తిరుగుతుంది. తన కన్నకూతురి ప్రేమ, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం అతడు పవిత్రమైన 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షను చేపడతాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి, అమాయకపు ఆడపిల్లలకు ఎదురయ్యే ఊహించని ప్రమాదం నుంచి దీక్షా నియమాలను పాటిస్తూనే అతడు తన కుటుంబాన్ని, ఊరిని ఎలా కాపాడాడనే అంశాన్ని దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఆకట్టుకునే తండ్రీ కూతుళ్ల బంధంయూఎస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ స్పందనను పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో నిజాయితీగా, మలయాళ చిత్రాల తరహా సహజత్వంతో సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, పాఠశాల నేపథ్యంలో మొదలయ్యే సన్నివేశాలు, కథలోని అంతర్లీన ఉత్కంఠ ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించాయి. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినప్పటికీ, ఇంటర్వెల్ సమయానికి వచ్చే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులుఇక సెకండాఫ్‌లో కథలోని ఎమోషన్స్ పీక్స్‌కి చేరుకుంటాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఊహించని ట్విస్టులు, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'మల్లెపూల పల్లకి' భక్తి గీతం నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసిస్తున్నారు. ట్విస్ట్ రివీల్ అయిన వెంటనే వచ్చే కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్‌ప్లే కాస్త పట్టు తప్పినట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయని టాక్ వినిపిస్తోంది.రవితేజ, బేబీ నక్షత్ర నట విశ్వరూపంనటీనటుల ప్రతిభ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. అయ్యప్ప మాలలో రవితేజ చూపించిన పరిపక్వత, ఆయన హావభావాలు కెరీర్లోనే ప్రత్యేకంగా నిలుస్తాయని సినీ ప్రియులు చెబుతున్నారు. తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతంగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర, రవితేజ మధ్య కెమిస్ట్రీ గుండెల్ని హత్తుకుంటుంది. సాయికుమార్ పలికిన పేరెంటింగ్, ఆడపిల్లల గురించిన సంభాషణలు ఎంతో ఆలోచింపజేసేలా ఉన్నాయి. అలాగే నటి స్వాసిక కూడా తన పాత్రలో చక్కటి ప్రతిభ కనబరిచింది.ప్లస్, మైనస్ పాయింట్స్జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చిన నేపథ్య సంగీతం, పాటలు ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పోలూరు పరిసర ప్రాంతాల గ్రామీణ అందాలను కెమెరాలో సహజంగా బంధించారు. కథనం మధ్యలో వచ్చే చిన్నపాటి లాజిక్ లోపాలు, కొన్ని సన్నివేశాల నెమ్మదితనం మినహాయిస్తే.. బలమైన కథ, రవితేజ సిన్సియర్ నటన, ఎమోషనల్ క్లైమాక్స్, థియేటర్ హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే 'ఇరుముడి' ద్వారా చాలాకాలం తర్వాత బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.




