
మంచు కొండల్లో స్కీయింగ్ (Skiing) చేయడం చూసే ఉంటారు. సరిగ్గా అలాగే, రెండు కర్రల (Poles) సాయంతో నేలపైన లేదా కాలిబాటల్లో నడవడాన్నే "నార్డిక్ వాకింగ్" (Nordic Walking) అంటారు. ఇది మొదటిసారిగా మంచు ప్రాంతాల్లో స్కీయింగ్ చేసే క్రీడాకారులు వేసవి కాలంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రారంభించారు. అయితే, ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక మంచి వ్యాయామంగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా వయసు పైబడిన వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది.స్విట్జర్లాండ్‌లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడి రైల్వే స్టేషన్లలో 70 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా ఈ పోల్స్ పట్టుకుని కొండల్లో నడవడానికి ఉత్సాహంగా వెళ్తుంటారని హార్వర్డ్ అనుబంధ మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆరోన్ బాగిష్ తెలిపారు. హార్వర్డ్ రీసెర్చ్ ప్రకారం నార్డిక్ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.నార్డిక్ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ కండరాలు పనిచేస్తాయి: సాధారణంగా నడిచినప్పుడు నడుము కింద ఉన్న కండరాలు (దాదాపు 50%) మాత్రమే పనిచేస్తాయి. కానీ నార్డిక్ పోల్స్ ఉపయోగిస్తే భుజాలు, చేతులు, ఛాతీ, పొట్ట, కాళ్ల కండరాలు కూడా యాక్టివ్ అవుతాయి. అంటే శరీరంలోని 80% నుంచి 90% కండరాలు పనిచేస్తాయి. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి: సాధారణ నడకతో పోలిస్తే ఇందులో 18% నుంచి 67% ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని మార్గం.ఆరోగ్యకరమైన మార్పులు శరీరంలో కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ, దీర్ఘకాలిక నొప్పులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం, కండరాల బలం, శ్వాసకోశ సామర్థ్యం, శరీర సౌలభ్యం (Flexibility) పెరుగుతాయి. శరీర సమతుల్యత (Balance): కాళ్లతో పాటు చేతుల్లో ఉన్న పోల్స్ నేలను తాకడం వల్ల నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోకుండా, కిందపడిపోయే ప్రమాదం తగ్గుతుంది.వాకింగ్ పోల్స్ (Poles) ప్రత్యేకత ఈ వ్యాయామంలో ఉపయోగించే పోల్స్ సాధారణ ట్రెక్కింగ్ పోల్స్ కంటే భిన్నంగా ఉంటాయి. గ్లౌవ్ సిస్టమ్: ఈ పోల్స్‌కు చేతి తొడుగులు (Gloves) లాంటి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. వీటిని చేతికి తొడుక్కుని, అరచేతి బలం ద్వారా ముందుకు నెడతారు. రకాలు: ఇవి అల్యూమినియం లేదా కార్బన్ మెటీరియల్‌తో తేలికగా ఉంటాయి. టిప్స్: మట్టి దారుల కోసం పదునైన (Pointed) కొనలు, సిమెంట్ రోడ్ల కోసం రబ్బరు (Rubber) కొనలు ఉంటాయి. ధర: ఇవి మార్కెట్లో సుమారు రూ. 1,600 నుంచి రూ. 16,000 వరకు లభిస్తాయి.అనుసరించాల్సిన పద్ధతులు డబుల్ పోలింగ్ (Double Poling): రెండు పోల్స్‌ను ఒకేసారి ముందుకు ఉంచి, నేలకు అనించి ముందుకు తోస్తూ, ఆపై 3 అడుగులు వేయాలి. (రెండు పోల్స్ ఉంచడం .. 1, 2, 3 అడుగులు వేయడం). సింగిల్ పోలింగ్ (Single Poling): ఇది మనం సాధారణంగా కాళ్లు వేసే పద్ధతిలోనే ఉంటుంది. కుడి కాలు ముందుకు వేసినప్పుడు ఎడమ చేయి/పోల్ ముందుకు రావడం లేదా అదే వైపు చేయి ముందుకు రావడం. కొత్తగా ప్రారంభించేవారు ఈ పద్ధతితో మొదలుపెట్టడం మంచిది.ఎలా ప్రారంభించాలి? డాక్టర్ సలహా: బ్యాలెన్స్ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మంచిది. కానీ గుండె జబ్బులు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలి. మార్గాన్ని ఎంచుకోండి: మంచి గాలి వెలుతురు ఉండే పార్కులు, ఖాళీ మైదానాలు లేదా రోడ్లపై నడవవచ్చు.కొన్ని ముఖ్యమైన చిట్కాలు సౌకర్యవంతంగా ఉండి, చేతులు తిప్పడానికి అనువుగా ఉండే దుస్తులు ధరించండి. నడవడానికి ముందు తగినంత నీరు తాగండి. గంటకంటే ఎక్కువ సమయం నడిస్తే వెంట వాటర్ బాడిల్ ఉంచుకోండి. వ్యాయామం ప్రారంభించే ముందు 10 నిమిషాల వార్మప్, పూర్తయ్యాక 10 నిమిషాల కూల్-డౌన్ తప్పనిసరి.నార్డిక్ వాకింగ్ గురించి ముఖ్యమైన విషయాలు ఆర్థరైటిస్/కీళ్ల నొప్పులు ఉన్నవారికి వరం: సాధారణ నడకలో మోకాళ్లపై, నడుముపై పూర్తి బరువు పడుతుంది. కానీ నార్డిక్ పోల్స్ వాడటం వల్ల శరీర బరువులో 20% నుంచి 30% వరకు బరువు చేతులపైకి మళ్లుతుంది. దీనివల్ల మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా హాయిగా నడవగలరు. వెన్నుపాము అమరిక: పోల్స్ పట్టుకుని నడవడం వల్ల వెన్నుముక తిన్నగా ఉంటుంది. రోజూ సిస్టమ్ ముందు కూర్చుని వంగిపోయే భుజాలు ఉన్నవారికి ఇది సరైన భంగిమను ఇస్తుంది. వయసుతో సంబంధం లేదు: ఇది కేవలం వృద్ధులకే కాకుండా బరువు తగ్గాలనుకునే యువతకు, రన్నర్లకు క్రాస్ ట్రైనింగ్‌గా కూడా బాగా ఉపయోగపడుతుంది.
Found this helpful?
Share this story with your network










