
తనిఖీల పేరుతో బెదిరింపులు నగదు, సెల్‌ఫోన్లతో ఉడాయింపు చేతిలో లాఠీ పట్టుకుని పోలీసులమంటూ విధులు నిర్వహిస్తున్న యువకులు వీరే... ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: చేతుల్లో లారీలతో రోడ్లపై నిలుచుంటారు. వాహన చోదకులను ఆపుతారు. డబ్బులివ్వాలని అడుగుతారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతారు. దుర్భాషలాడతారు. చరవాణులు, వస్తువులను బలవంతంగా లాక్కొని పరారవుతారు. ఇదీ పోలీసుల ముసుగులో కొందరు కంత్రీలు సాగిస్తున్న దందా తీరు. అమాయకులనే లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రిళ్లు దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రొద్దుటూరు పట్టణ శివారు ప్రాంతాల్లో పోలీసుల పేరుతో కొందరు యువకులు ముఠాలుగా ఏర్పడి ఒంటరి వ్యక్తులు, ప్రేమికులను బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవ్వకుంటే స్టేషన్లకు తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వాహనదారులు, ఒంటరి వ్యక్తులు వారి ఆగడాలకు భయపడి ఎంతో కొంత సమర్పించుకుంటున్నారు. డబ్బులు లేవంటే సెల్‌ఫోన్లు లాక్కుంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇటీవల పలుచోట్ల ఈ తరహా ఉదంతాలు వెలుగులోకి వచ్చిన క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి రాత్రి వేళల్లో ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్లపై మద్యం తాగుతున్న వారిని, ప్రేమికులను నకిలీలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విధుల్లో ఉన్నప్పుడు అసలైన పోలీసులు యూనిఫాం ధరిస్తారనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎక్కువ జుట్టు, గడ్డం పెంచుకున్న వ్యక్తులు పోలీసులమని చెబితే అనుమానించి ఐడీ కార్డు, వివరాలు అడగాలి. అనుమానం ఉంటే వెంటనే స్థానిక స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. నాగభూషణ్, ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా సీఐ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





