
అనుమతి లేకుంటే కేసులు తప్పవు వరంగల్‌ క్రైం (హనుమకొండ), న్యూస్‌టుడే: ఏ వేడుకైనా డీజే (డిస్క్‌ జాకీ) సంగీతాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో విగ్రహాల వద్ద, నిమజ్జనం ఊరేగింపులో డీజేలను ఎక్కువగా వాడుతుంటారు. దీంతో శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. ధ్వని తరంగాలు 70 నుంచి 85 డెసిబుల్స్‌ వరకు ఉంటే ఇబ్బందులుండవు. అయితే డీజే శబ్దం 90 నుంచి 120 డెసిబుల్స్‌ వరకు పెడతారు. ఎక్కువ శబ్ద కాలుష్యంతో బ్రెయిన్‌ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా డీజేలు ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తారు. న్యూసెన్స్‌ లేదా శబ్ద కాలుష్యం కింద కేసులు నమోదు చేసి ఆయా వాహనాలతోపాటు డీజే కోసం ఉపయోగించిన అన్ని వస్తువులను సీజ్‌ చేస్తారు. తర్వాత బాధితులు కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించి తిరిగి వాహనం తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకొని కూడా సమయపాలన పాటించకుండా డీజే వినియోగిస్తే కూడా కేసులు నమోదు చేస్తారు. కోర్టులో రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రాత్రి 10 తర్వాత అనుమతి లేదు - నర్సింహారావు, ఏసీపీ, హనుమకొండ వేడుకల్లో డీజేను వినియోగిస్తే పోలీసుల నుంచి ముందస్తు అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకు మీసేవలో దరఖాస్తు చేయాలి. తర్వాత సంబంధిత ఠాణా ఎస్‌హెచ్‌వోకు విచారణకు పంపిస్తారు. అక్కడి నుంచి ఏసీపీకి వస్తుంది. అన్ని పరిశీలించిన తర్వాత అనుమతి ఇస్తారు. రాత్రి 10 గంటల్లోపు మాత్రమే డీజేలకు అనుమతి, ఆలోపు తక్కువ డెసిబుల్స్‌ వరకు పెట్టి వినియోగించాలి. అంతకంటే ఎక్కువగా శబ్ద కాలుష్యం చేస్తే కేసు నమోదు చేస్తాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




