
తిరుమలను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమగ్ర మాస్టర్ ప్లాన్ ప్రకటించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండో రోజు తిరుమల పర్యటనలో భాగంగా బుధవారం టీటీడీ భవిష్యత్తు అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులతో సమావేశం అనంతరం ఈ ప్రణాళికలోని కీలక అంశాలను వెల్లడించారు. “మానవ సేవే మాధవ సేవ” అనే సూత్రంతో టీటీడీ కార్యకలాపాలను 6 ప్రధాన అంశాల చుట్టూ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అన్నదానం, వైద్య సేవలు, శ్రీవారి సేవకులు, విద్యాదానం, ఆలయాల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణకు తిరుమల మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. భక్తులకు మెరుగైన సేవలతో పాటు తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు చంద్రబాబు చెప్పారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రూ.3,165-3,168 కోట్ల కార్పస్ ఫండ్‌తో నిరంతరం కొనసాగించాలని నిర్ణయించారు. భక్తుల సూచన మేరకు మజ్జిగ స్థానంలో పెరుగు అందించే చర్యలు చేపట్టనున్నారు. వైద్య సేవల్లోనూ భారీ మార్పులకు ప్రణాళిక రూపొందించారు. స్విమ్స్, బర్డ్, రుయా, చిల్డ్రన్ హాస్పిటల్, కార్డియాలజీ, టాటా క్యాన్సర్, అరవింద్ ఐ హాస్పిటల్‌ను ఒకే అపెక్స్ బాడీ కిందకు తీసుకురావాలని ప్రతిపాదించారు. శ్రీవారి సేవకుల వ్యవస్థను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే నమోదైన 12 లక్షల మంది సేవకులకు అధునాతన శిక్షణ ఇచ్చి వైద్యం, విద్య, సాంస్కృతిక రంగాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 800 మందికి పైగా శ్రీవారి వైద్య సేవకుల సేవలను కూడా ఉపయోగించుకోనున్నట్లు చంద్రబాబు తెలిపారు. విద్యాదానంలో భాగంగా టీటీడీ విద్యాసంస్థలను ప్రక్షాళన చేసి ఉపాధి ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పాలిటెక్నిక్‌ను పీఎం-శ్రీ కింద అభివృద్ధి చేయడంతో పాటు తిరుపతిని పారిశ్రామిక, ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించాలని ప్రణాళిక రూపొందించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా రూ.20-40 లక్షల వ్యయంతో 5,000 చిన్న ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. నియోజకవర్గ కేంద్రాల్లో రూ.5-10 కోట్లతో పెద్ద ఆలయాలు నిర్మించి వాటిని “హబ్ అండ్ స్పోక్” విధానంలో అనుసంధానించాలని భావిస్తున్నారు. మారిషస్, న్యూజిలాండ్‌తో పాటు హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రపంచంలోని నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమల మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేక స్థానం కల్పించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న 89.4% పచ్చదనాన్ని మరింత పెంచడంతో పాటు ఔషధ మొక్కలతో “పవిత్ర వనం” ఏర్పాటు చేయనున్నారు. నీటి సంరక్షణ, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే చర్యలతో పాటు తిరుమలను నెట్-జీరో కర్బన ఉద్గారాల క్షేత్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదిన్నరలో 100 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. రూ.104 కోట్లతో ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, భక్తుల కోసం కొత్త అనుభూతి కేంద్రం, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సహా పలు కార్యక్రమాలు సెప్టెంబర్ 16న సీఎం ప్రారంభించేలా టీటీడీ ముందుగానే షెడ్యూల్ చేసింది. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని టీటీడీ ప్రకటించింది. తిరుపతిలో రైల్వే స్టేషన్ నుంచి బస్‌స్టాండ్ వరకు స్కైవాక్, రూ.90 కోట్లతో కోర్టు కాంప్లెక్స్ నుంచి పద్మావతి ఆలయం వరకు 100 అడుగుల రహదారి, వడమాలపేట వద్ద 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు వంటి ప్రాజెక్టులను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. టీటీడీ ఆస్తులు, ఆభరణాలు, నిధుల వివరాలను ఆన్లైన్లో ఉంచి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. తిరుమలను రాజకీయ వేదికగా కాకుండా పవిత్రమైన ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ మాస్టర్ ప్లాన్ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.




