
Telangana Smart Ration Card : తెలంగాణ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న స్మార్ట్ రేషన్ కార్డు సాధారణ కార్డులకు పూర్తి భిన్నంగా ఉండనుంది. కేవలం లబ్ధిదారుల వివరాలు మాత్రమే కాకుండా.. నకిలీ కార్డులకు చెక్ పెట్టేలా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో పొందుపర్చనున్నారు. యాంగిల్ మార్చితే కనిపించే హిడెన్ ఇమేజెస్, UV లోగో, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, భూతద్దంతో మాత్రమే కనిపించే మైక్రో టెక్స్ట్ వంటి ప్రత్యేకతలు ఈ కార్డులో ఉన్నాయి. కార్డును తాకినా, స్కాన్ చేసినా దాని అసలైనదో కాదో గుర్తించేలా సాంకేతికతను ఉపయోగించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులను అందజేయనుంది. ఆగస్టు 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు.. కార్డు యాజమాని వివరాలు ఉంటాయి. అంతేకాక.. రేషన్ దుకాణం నంబరు, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అధికారిక సంతకం ఉంటుంది.
స్మార్ట్ రేషన్ కార్డు ముందు, వెనుక భాగాల్లో స్పర్శ ద్వారా గుర్తించే, డిజిటల్‌గా ధ్రువీకరించే సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్, ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ రిలీఫ్ టెక్స్ట్, సూక్ష్మ అక్షరాలతో కూడిన మైక్రో టెక్స్ ఇందులో ఉన్నాయి. సాధారణ ప్రింటింగ్ పద్ధతులతో వీటిని యథాతథంగా డూప్లికేట్ చేయడం కానీ, కాపీ చేయడం కానీ.. కష్టంగా ఉండేలా డిజైన్ చేశారు.
ప్రభుత్వం పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులో అత్యాధునిక ఫీచర్లను పొందుపర్చారు. కార్డులో అత్యంత సూక్ష్మ పరిమాణంలో మైక్రో టెక్స్ట్ ను ముద్రించనున్నారు. సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించని ఈ అక్షరాలు భూతద్దం ద్వారా పరిశీలించినప్పుడు మాత్రమే గుర్తించగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటింగ్ యంత్రాలతో వీటిని డూప్లికేట్ చేయడం కష్టతరం. కార్డు బ్యాక్ గ్రౌండ్లో గిల్లోష్ ప్యాటర్న్ అనే సంక్లిష్ట రేఖా ఆకృతిని ఉపయోగించనున్నారు.
స్మార్ట్ రేషన్ కార్డులో డ్యూయల్ హిడెన్ ఇమేజెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ‘జీవోటీజీ’ తదితర రహస్య గుర్తులు నిర్దిష్ట కోణంలో లేదంటే మాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా రూపొందించారు. దీంతో కార్డు ఒరిజినాలిటీని పరిశీలించేందుకు అదనపు అవకాశం లభిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన వాటర్ మార్క్ కార్డులో పొందుపరుస్తారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో డ్యూయల్ హిడెన్ ఇమేజెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ‘GOTG’ తదితర రహస్య గుర్తులు నిర్దిష్ట కోణంలో లేదా మాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా డిజైన్ చేస్తున్నారు. దీంతో కార్డు ఒరిజినలా? నకిలీదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు మరో భద్రతా ప్రమాణం అందుబాటులోకి వస్తుంది.
కార్డు వెనుక భాగంలో 20/20 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నారు. ఇందులో డిజిటల్ గా సేఫ్టీ సమాచారాన్ని పొందుపరచి, అథరైజ్డ్ సాఫ్ట్వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా లబ్దిదారుల వివరాలను ధ్రువీకరించేలా వ్యవస్థను రూపొందించారు. డేటాలో అనధికార మార్పులు, డూప్లికేషన్, నకిలీ కార్డులు తయారీని అడ్డుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. ఇక కార్డుపై చేతితో తాకినప్పుడు గుర్తించగలిగేలా కొన్ని అక్షరాలు, వివరాలను ఎంబోస్ చేసే విధానాన్ని ప్రతిపాదించారు. దీ నివల్ల దృష్టితోనే కాకుండా స్పర్శ ద్వారా కూడా కార్డు సెక్యూరిటీ ఫీచర్‌ను పరిశీలించే అవకాశం ఉంటుంది.






