
ఏడు రకాల పింఛన్లకే చేయూత దరఖాస్తుల స్వీకరణ ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న వృద్ధాప్య పింఛన్లకు లభించని అనుమతి 3,692 మంది వృద్ధుల దరఖాస్తులకు మొండిచేయి హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నూతన చేయూత పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించి, అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ నిర్ణయం ఏళ్ల తరబడి పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వేలా దిమంది వయోవృద్ధులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు రకాల పింఛన్లకు మాత్రమే దరఖా స్తులు స్వీకరిస్తుండగా, వృద్ధాప్య పింఛన్లను ఈ జాబితాలో చేర్చకపోవడంతో వృద్ధుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి ఎదురుచూపులు గతంలో వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గించినప్పటికీ అనేక మంది అర్హులకు అవకాశం దక్కలేదు. ఆన్లైన ఐడీలు ఓపెన్ కాకపోవడంతో జిల్లావ్యాప్తంగా వేలాది మంది అర్హులైన వృద్ధులు అప్లై చేసుకోలేకపోయారు. ప్రభుత్వం మారిన తర్వాతైనా తమకు అవకాశం వస్తుందని భావించిన వయోవృద్ధులకు ప్రస్తుతం మళ్లీ కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఏడు రకాల వారికే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొదటి విడతగా ఏడు కేటగిరీల వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం క ల్పించారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, పైలేరియా, తలసేమియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు మాత్రమే ప్రాధాన్యం కల్పించారు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు రకరకాల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి చేయడంతో జిల్లాలోని తహసీల్ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల వ ద్ద రద్దీ నెలకొంది. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛను రూ.4016, వితంతు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ.2016 ప్రతినెలా అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులకు అవకాశం కల్పించకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 1,00,504 మంది పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా ప్రభుత్వం నుంచి రూ.23.12 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ప్రస్తుతం 3530 మంది మృతి చెందిన వారిని గుర్తించగా, 14మంది నాట్ ఇంట్రెస్టెడ్లను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 11,236 మంది నూతన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉండగా ఇందులో వయోవృద్ధులను మినహాయిస్తే 7544 పింఛను దరఖాస్తులు ఉన్నాయి. వారిని ఈనెల 31 తేదీలోపు ఆన్లైన్ నమోదు చేసి పరిశీలించాల్సి ఉంది. ప్రజాపాలన అప్లికేషన్లపై అయోమయం గతంలో నిర్వహించిన ప్రజాపాలన, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినప్పటికీ ఆ దరఖాస్తుదారులకు నేరుగా పింఛన్ ఇస్తారా లేక మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది. అర్హులైన వారు ఈనెల 31లోపు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లేదా వార్డు ఆఫీసర్లకు తమ దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వార్తలు కూడా చదవండి: బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. కూరగాయలు కాదు.. కాలకూట విషం Read Latest AP News And Telangana News And International News And Telugu News





