
రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
రుణమాఫీ అమలులో గత ప్రభుత్వం విఫలం: తుమ్మల
హైదరాబాద్: రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ అమలు తీరు దారుణంగా సాగిందని, ఆ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు విస్మరించినా.. రైతులు మాత్రం గుర్తుపెట్టుకున్నారని ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉందని,
అయినప్పటికీ రూ. లక్ష వరకు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయకుండా.. వాయిదాల్లో నాలుగు సంవత్సరాల పాటు చెల్లించడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల వడ్డీ భారం పడిందని అన్నారు. 2018లోనూ రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని నమ్మించి, చివరకు సగం మందికే అమలు చేసి.. రూ. 8,379 కోట్లు పూర్తిగా ఎగవేశారని ఆరోపించారు. పదేళ్ల పాటు రైతులను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు వారిపై కపటప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి పంట కాలంలోనే ఒకేసారి రూ. 20,617కోట్లు మాఫీ చేసి.. 25,35,964 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిందని తుమ్మల స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతో రూ. 2 లక్షలలోపు ఉన్న పంట రుణాలన్నింటిని మాఫీ చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నామని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రైతులకు ఉన్న పంట రుణ బాకీలు అత్యల్పమని పార్లమెంట్లో కేంద్ర నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News





