
కుటుంబ కలహాలు పతాక స్థాయికి చేరడంతో ఓ అల్లుడు విచక్షణ మరిచి ప్రవర్తించాడు. అత్తపై ఉన్న కోపాన్ని అమానుషంగా ప్రదర్శిస్తూ, ఇంటిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇల్లంతా కాలి బూడిదవ్వగా.. విలువైన సామగ్రి, బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడిహత్నూర్కు చెందిన కడమంచి రాజలక్ష్మీకి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆమె చిన్న కూతురును వస్తాద్ అరుణ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే కొంతకాలంగా అరుణ్ తరచూ అత్తారింటికి వచ్చి గొడవ పడుతుండేవాడు. ఈ నెల 8న అత్తారింటికి వచ్చిన అరుణ్, భార్యతో పాటు ఇంట్లో ఉన్నవారందరినీ చంపేస్తానని తీవ్రస్థాయిలో బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అల్లుడి బెదిరింపులకు భయాందోళనకు గురైన రాజలక్ష్మీ, తన చిన్న కుమార్తెను వెంటబెట్టుకుని హైదరాబాద్లో నివసిస్తున్న మరో కూతురు ఇంటికి వెళ్లిపోయారు.





