

Ganesh Chathurthi 2026 : భాద్రపద శుద్ధ చతుర్థి వచ్చిందంటే చాలు పల్లె నుంచి పట్నం వరకు వీధులన్నీ విఘ్నేశ్వరుని నామస్మరణతో ప్రతిధ్వనిస్తాయి. ఊరూవాడా ఏకమై జరుపుకునే ఈ వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అదొక వర్ణరంజితమైన ప్రజా ఉత్సవం. సామాజిక సమైక్యతకు, సంస్కృతి సంప్రదాయాల వైభవానికి దివ్య సంకేతం. నవరాత్రుల్లో మంటపాల్లో కొలువుదీరే గణపయ్య సమాజానికి ఎన్నో సందేశాలనిస్తాడు.
వినాయకుడిని మంటపంలో పెట్టి నవరాత్రులు పూజలు చేస్తే సరిపోదు. ఆ విఘ్నేశ్వరుడు లోక కళ్యాణార్థం ఇచ్చే సందేశాలను మనసులో నిలుపుకోవాలి. దినచర్యగా భావించాలి. నిత్యం ఆచరించాలి. అప్పుడే గణపతి కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులపై ఉంటాయి. అంతే కానీ.. ఏడాదిలో ఓ 9 రోజులు ఘనంగా గణపతిని నిలిపి పూజించేశామని చేతులు దులిపేసుకుంటే ఆ ఆదిదేవుడి కటాక్షం ఉండదని అంటారు పండితులు.
నేటి డిజిటల్ యుగంలో ఇతరుల మాట వినే ఓపిక తగ్గింది. స్వామి పెద్ద చెవులు- ఏనుగు తొండం ‘ఎక్కువగా వినాలి, శ్రద్ధగా గ్రహించాలి, తక్కువగా మాట్లాడాలి అనే సంభాషణ నైపుణ్యాన్ని సూచిస్తాయి. చిన్న కళ్లు లోతైన పరిశీలనకు గుర్తు. బయట హంగులు కాదు.. విషయ పరిజ్ఞానం, అధ్యయనం ముఖ్యమని చాటుతాయి. విఘ్నేశ్వరుడు కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు. ఆయన నాయకత్వ సూత్రాలకు సజీవ నిదర్శనం.
దేవతలందరినీ, ప్రమథ గణాలను నడిపించే ‘గణాధిపతి’ పదవి ఆయనకు ఊరికే రాలేదు తన విశిష్ట గుణగణాలతోనే ఆయన ఆ స్థానాన్ని సాధించుకున్నారు. కుమారస్వామితో పోటీలో ముల్లోకాలను చుట్టిరమ్మంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి విజయం సాధిస్తాడు. అంటే కేవలం శ్రమ ఉంటే సరిపోదు.. సమయానుకూలత, చతురత, బుద్దిబలం ముఖ్యమని ఈ సంఘటన నేర్పుతుంది.
ఆకృతిలో భారీగా ఉండే బొజ్జ గణపయ్య ఎంతో చిన్నదైన ఎలుకను తన వాహనం చేసుకున్నాడు. అంటే సమాజంలో స్థాయిబేధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించాలి, తగిన ప్రాధాన్యత ఇచ్చి కలుపుకొని వెళ్లాలన్న సందేశాన్ని పార్వతీ తనయుడు మనకు అందిస్తాడు. జీవితంలో ఎన్నో మంచి చెడులు ఎదురవుతాయి. వాటన్నింటినీ స్వీకరించాలని పెద్ద బొజ్జ చెబుతుంది. శక్తివంతంగా, ఓర్పుతో మనకు ఎదురయ్యే పొగడ్తలు, విమర్శలను అందుకొని జీర్ణం చేసుకోవాలనేది లంబోదర తత్త్వం నేర్పుతుంది.
మహాభారతాన్ని వేగంగా రాసే క్రమంలో చేతిలో కలం విరిగిపోతే వ్యాస మహర్షి చెబుతున్నదాన్ని చెబుతున్నట్లు రాయడానికి వెంటనే తన రెండు దంతాల్లో ఒకదాన్ని విరిచి రాయడం ప్రారంభించాడు గణపతి. అంటే లక్ష్య సాధనలో ఎన్ని విఘ్నాలు ఎదురైనా.. త్యాగం, దీక్ష, అంకిత భావంతో ఆ లక్ష్యసాధనకు చేరుకోవాలన్నదానికి ఇది ప్రతీక.
నవరాత్రుల్లో మట్టి విగ్రహాలను వాడటం , 21 మూలికా ప్రతులతో పూజించడం వెనక ప్రకృతిని కాపాడుకోవాలన్న పర్యావరణ స్పృహ దాగుంది. కేవలం పూజలు, ఆర్భాటాలకే పరిమితం కాకుండా గణనాథుని రూపంలోని ఈ విశిష్ట గుణాలను ప్రవర్తనలో భాగం చేసుకోవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నీరాజనం.
ద్వేషాలు, విభజనలు పెరిగిపోతున్న నేటి కాలంలో ‘ఏకదంతుని’ సందేశం స్వీకరించేవారికే పరమార్థం బోధపడుతుంది. నేటి కార్పొరేట్, సామాజిక జీవితంలో గడువులు, సంక్షోభాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా… సమస్యకు తక్షణ పరిష్కారం వెతికి, బాధ్యతను పూర్తి చేసే డెడికేషన్‌కు ఏకదంతుని కథ అత్యుత్తమ మార్గదర్శి. సమస్త జీవజాలాన్ని గౌరవిస్తూ, ప్రకృతితో సమతుల్యతను పాటిస్తూ జీవించడమే ఆ బొజ్జ గణపయ్యకు మనం ఇచ్చే నిజమైన ఆరాధన.




